Home » ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్)

ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్)

Published on July 11, 2025

by live
0 comment

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన “యూనివర్సిటీ (పేపర్ లీక్)” చిత్రం ఈ నెల ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్. నారాయణ మూర్తితో పాటు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందేశ్రీ, జయరాజ్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం తదితరులు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా తప్పక చూడవలసిన చిత్రమని ప్రశంసించారు.

ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ –
ఈ సినిమాలో ఐదు గీతాలు ఉన్నాయి. వీటిని గద్దర్ గారు, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్ వంటి ప్రఖ్యాత రచయితలు రచించారు.
ఈ చిత్రం ప్రధాన అంశం – విద్యా వ్యవస్థలో పెరుగుతున్న పేపర్ లీక్‌లు. గ్రూప్-1, గ్రూప్-2 లాంటి పరీక్షల పేపర్లు లీకవుతుండటం చూస్తుంటే చదువు విలువ ఏమైందో అనిపిస్తోంది.
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. నిరుద్యోగుల ఆశలు చిందరవందర అవుతున్నాయి.
“లంబకోణాలు నేర్పే వారు కుంభకోణాలు చేస్తున్న రోజుల్లో”, విజ్ఞాన పావురాల రెక్కలు విరిగిపోతున్నాయనీ, తల్లిదండ్రులు, గురువులు ఆశాభంగమవుతున్నారనీ బాధతో చెప్పారు.

పేపర్ లీక్, కాపీయింగ్ లాంటి అక్రమాలు, అణుబాంబులు కంటే ప్రమాదకరమైనవని పేర్కొన్నారు.
వైద్య విద్యార్థులు కాపీ చేస్తే వారి చేతిలో పేషెంట్ బ్రతుకుతాడా? ఇంజినీర్లు అవుతున్న వారు కాపీ చేస్తే నిర్మాణాలు నమ్మకంగా ఉంటాయా? అనే గంభీర ప్రశ్నలు సంధించారు.
విద్యను ప్రైవేట్ మాఫియాల చెర నుంచి విముక్తం చేయాలి, జాతీయీకరణ అవసరం అన్నారు. ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టంగా మారుస్తూ నడిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందేశాన్నే తమ చిత్రం స్పష్టంగా చెబుతుందని తెలిపారు.

నటీనటులు: ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్, ఇతర నూతన తారాగణం
గీత రచయితలు: గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్
ఎడిటింగ్: మాలిక్
కెమెరా: బాబూరావు దాస్
కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4