పాత సందుకాలో వెతుకుతుంటే పాతపుస్తకం..
పాతపుస్తకాలతో నాచెలిమి అంతఇంతా కాదు.
హైదరాబాద్ :
ఒకటి నా చేతును ప్రేమగా అల్లుకుంది..పుస్తకం బాల్యపు స్మృతుల్ని ఎన్నో ఏళ్లుగా మోస్తుంది. అక్షరాలు లేతచిగురుటాకుల్లా మెరుస్తున్నాయి. చిన్న నాటి స్నేహితులు పలుకరించిన్నట్లు వారి దస్తూరితో కూడిన అక్షరాలు పేజీల్లో…స్నేహపరిమళాల్ని పరివ్యాప్తం చేస్తున్నాయి.
కొంటెగా రాసుకున్న ప్రేమగుర్తులు…. మరిచిపోయిన జ్ఞాపకాలను గుల్మోరాలై తట్టిలేపుతున్నాయి. కట్టెలపొయ్యి మీద వండిన అన్నాన్ని పుట్టలకు అతికించిన వాసన ఇంకా వస్తుంది.
ఎన్నో సార్లు అమ్మచేతితో తాకిన పుస్తకం కదా!!
చేతిలోకి తీసుకోగానే కన్నీటితో తడిసిపోయింది. ఆత్రంగా పీజీలు తిరిగేస్తుంటే..నెమళ్లు నాట్యమాడుతున్నట్లు, చిలుకలు వచ్చి అక్షరాలకొమ్మమీద వాలినట్లు, పిచ్చుకలు కాగితపు కొసల్ని కరుచుకు తిన్నట్లు…ఊహల సముద్రంలో కాగితపు పడవై నింగి అంచుకు జారినట్లు..ఇంకుకు తడిసిన పేజీ రాత్రికురిసిన వానకు తడిసి ఆరిన జొన్న చొప్పలా ఉంది.
అక్కడక్కడ ముదురుగోధుమ వర్ణపు మచ్చలు….. బహుశా ఏడ్చిన కన్నీటి ధారల చాయలేమో!!
అక్కడక్కడ పేజీలు చిరిగినాయి కరుకు గుండెలు మొరటుగా చెక్కిన ఉలిదెబ్బలేమో!
పాతపుస్తకాలతో నాచెలిమి అంతఇంతా కాదు..సంధ్య చీకట్లు కమ్మినప్పుడు… కందిలీ వెలుగులో అక్షరాలు స్వర్ణకిరీటాలుతొడుక్కునేవి.
శ్రావణమేఘాల చినుకులకు నెత్తిన తొలి గొడుగులయ్యేవి…నెమలీకలు దాచుకునే రహస్యనేస్తాలయ్యేవి. మిత్రులకు రాయబారం పంపడానికి ఉత్తరాల పావురలయ్యేవి. ఇపుడు పుస్తకంలో నా ఆత్మప్రతిబింభం ప్రతిఫలిస్తుంది. భావాలవెలుగులో మనసుదీపం కాంతిమయమైతుంది. నాజీవన ప్రయాణం నా కళ్లముందు దర్శిస్తుంది.
కాసిన్ని అక్షరాలు జేబులో వేసుకుని బయలు దేరినాన… ఇప్పటికి తాజాగా పరిమళ్లిస్తూనే ఉన్నాయి…పాతపుస్తకాలు అమ్మే షాప్ లను,మనుషులను చూస్తే ఎంతో అభిమానం . ఎందరికో రంగులప్రపంచాన్ని చూపి జీవన ద్వారాలు తెరిచే నేస్తాలైతారు. సాగరతీరాన్ని చేర్చే పడవకు లంగరైతారు. పాతపుస్తకం ఇప్పుడు మళ్ళీ దాచుకోవాలి బతుకు సంబ్రమం ముగిసేవరకు..!
– డాక్టర్. తుమ్మల దేవరావ్
నిర్మల్, 8985742274.