1971 లో రిలీజ్ అయి ఇంగ్లీష్ లో డబ్ అయి, 125 దేశాల్లో ప్రదర్శించబడ్డ ఒకే ఒక్క తెలుగు సినిమా.ఈ సినిమాను ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు. కౌబాయ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే చాలా ఇష్టం,ఇప్పటికి నా మెదడులో ఆ తాలుకూ సంగీత రసానుభూతి నిక్షిప్తంగా ఉంది, ఆదినారాయణ నేపథ్య సంగీతం మనను ముగ్ధుల్ని చేస్తుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తగ్గట్టుగా …హాట్ .. పెట్టుకుని “కృష్ణ “గుర్రాల మీద జామ్ జామ్మని పోతూ, తుపాకులు పట్టుకుని కాల్చుకుంటూ, కొండలూ, గుట్టలూ అన్న భేదం లేకుండా తిరుగుతుంటే నా చిన్ననాటి మధురస్మృతులు గుర్తొస్తుంటాయి. సినిమా వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది.. బొబ్బిలి యుద్ధం కాలంలో.. భారతదేశాన్ని ఫ్రెంచ్, ఇంగ్లీష్ వాళ్ళు ఆక్రమించుకుంటున్న సమయంలో.. నవాబులు, పాలేగాండ్రు,ఎవరికీ వారే సంస్థానదీషులుగా ప్రకటించుకుంటున్న సందర్భంలో.. అమరవీడు సంస్థానంలో విధేయులుగా పనిచేసే దానాల ధర్మయ్య,పగడాల సుబ్బయ్య, ప్రభువును కాపడుకోకపాయినా, ఖజానా మాత్రం ప్రజలకు లేక వారి వారసులకు చెందాలన్న సంకల్పంతో ఎవరికీ తెలెయని కొండ గుహల్లో దాస్తారు. ఆ ఖజానాను హీరో అయిన “కృష్ణప్రసాద్” ఏ విధంగా సాధిస్తాడు, తండ్రి చావుకు కారణమైన వారిని ఏ విధంగా తుదముట్టిస్తాడు..తన తో పాటు ప్రయాణిస్తున్న రాధ తన ప్రతీకారాన్ని ఏవిధంగా తీర్చుకుంది స్థూలంగా ఇది కథ. ఆరుద్ర కథ,సంభాషణలు సమకూర్చినా,స్పూర్తి మాత్రం .. హాలీవుడ్ సినిమా లైన The Good, the Bad and the Ugly, For a Few Dollars More, Mackenna’s Gold అన్న భావన కలుగుతుంది.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాజస్థాన్ లో జరిగింది, హిమాచల్ ప్రదేశ్ లో… షూట్ చేసిన… కోరినది…దరిచేరినది…ఎదలు ఒకటాయే..అన్న పాట మనను ఆకట్టుకుంటుంది.గజదొంగ నాగన్న పాత్రలో నాగభూషణం పలికే “నీ ..తల్లి …ముండబోయ అనే .. సంభాషణా చాతుర్యం చర్వణ చర్వితం. సినిమా లో మరో విశేషం చాయాగ్రహణం,ఇప్పట్లోలాగా స్టడీకామ్‌లు లేవు అన్నీ పెద్ద సైజ్ కెమెరాలే. అయినా కూడా ఎక్కడా జర్క్ లు లేకుండా గుర్రాల ఛేజ్ తీశారంటే V.S.R. Swamy ఎంత ప్రతిభావంతుడో మనకు అర్థమవుతుంది.కాస్ట్యూమ్స్, సెట్స్ భలే ఉంటాయి… ఈ సినిమాలో హీరో పాత్ర పోషించిన సూపర్ స్టార్ కృష్ణ నిజంగా సూపర్ స్టారే.. సాహసవీరుడిలా కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా కనిపించడం ఆయనకే సాధ్యమైంది. నిధి కోసం అన్వేషణ,. దాని కోసం సాగే జర్నీని చాలా ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు K.S.R దాస్ ప్రతిభ మనకు కనబడుతుంది.మోసగాళ్ళకు మోసగాడు వచ్చి ఇప్పటికి 44 ఏళ్లవుతోంది, కానీ సినిమా ఇప్పటికీ ఫ్రెష్‌గానే వుంటుంది. ప్రపంచం డెవలప్ అయినా,వివిధ మాధ్యమాలు ఏలుతున్న…, మనిషికి డబ్బు మీద,నిధులపై ఇంకా వ్యామోహం పోలేదు కదా.దర్శకుడు ఎన్నుకున్న కథా నేపథ్యం గొప్పది..
మోసగాళ్ళకు మోసగాడు By Prakash Surya
50