క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త క్రిమినల్ చట్టాలు-నల్సార్ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కొత్త క్రిమినల్ చట్టాలు- దామోదర్, మాజీ ఐజీ
దర్యాప్తు ప్రక్రియలకు కాలపరిమితి- రాజశేఖర్, ఐ.పి. ఎస్, డైరెక్టర్, సిడిటిఐ
హైదరాబాద్ :
అందరికీ న్యాయం అందించడం కోసం సమకాలీన, సాంకేతికతలకు అనుగుణంగా పలు అంశాలను పొందుపరిచి జులై 1 నుంచి దేశంలో అమలు కానున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాల పై అవగాహన కల్పించే ఉద్దేశంతో పత్రికా సమాచార కార్యాలయం, హైదరాబాద్ ఆధ్వర్యాన పాత్రికేయ మిత్రుల కోసం, దేశంలో జులై 1 నుంచి అమలులోకి రానున్న 3 క్రిమినల్ చట్టాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌నకు అదనపు డైరెక్టర్ జనరల్ (పిఐబి) శృతి పాటిల్ అధ్యక్షత వహించారు.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 150 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు తెలిపారు. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) 1860, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ)1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ల స్థానంలో ఈ మూడు చట్టాలు రానున్నాయని ఆయన తెలిపారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్ ఏర్పాటు చేసిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై నిర్వహించిన వార్తలాప్ – మీడియా వర్క్ షాప్ లో ప్రొఫెసర్ రావు మాట్లాడుతూ, గత ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం నోటిఫై చేసి, 2024 జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలు శిక్ష కంటే న్యాయంపై దృష్టి సారిస్తాయని, బాధితుల కేంద్రీకృత న్యాయాన్ని నిర్ధారిస్తాయని చెప్పారు. విచారణను వేగవంతం చేయడం ద్వారా, అసమంజసమైన వాయిదాలను అరికట్టడం ద్వారా – సత్వర న్యాయం అందేలా చూడటానికి కాలపరిమితిని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సవరించిన క్రిమినల్ చట్టాలు మారుతున్న కాలానికి అనుగుణంగా నవీకరించబడ్డాయన్నారు.
దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు తీసుకోనున్న చర్యల్లో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు క్రిమినల్ చట్టాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఉండనున్నాయని, ఈ చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని మాజీ ఐజీ ఈ.దామోదర్ అన్నారు. క్రిమినల్ చట్టాల మైక్రో నైపుణ్యాలను కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమాజానికి వాటి ఆచరణాత్మక ఉపయోగం చుట్టూ జరుగుతున్న నేరాల గురించి వివరించారు. కొత్త చట్టాల్లో పేర్కొన్న కమ్యూనిటీ సేవల శిక్షలు మనకు ఇంతకు పూర్వం పూర్తిగా తెలియనివని అన్నారు. వాడుకలో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా ఈ మూడు క్రిమినల్ చట్టాల్లో పలు కొత్త నిబంధనలను చేర్చినట్టు చెప్పారు. ఈ చట్టాలు నేరస్తులకు శిక్ష వేయడం కంటే బాధితులకు న్యాయం అందించడంపైనే దృష్టి పెడతాయన్నారు. బాధితులు తమకు జరిగిన అన్యాయంపై సంఘటన స్థలం నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదు రికార్డు అవుతుందని చెప్పారు. నేరస్తులను విచారించేందుకు జ్యుడీషియల్ కస్టడీ కాలపరిమితి పెంచనున్నారని తెలిపారు. పెరిగిన సాంకేతికని నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని చెప్పారు.రోడ్డు ప్రమాదాల బాధితులను గోల్డెన్ అవర్లో ఆస్పత్రిలో చేర్చితే మరణాలను నివారించవచ్చునన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ చట్టాల ద్వారా బాధితులకు న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం కలుగుందని చెప్పారు.ఈ చట్టాల వల్ల పరిధితో సంబంధం లేకుండా సంఘటనా స్థలం నుంచే ఫిర్యాదు చేసి ఇ-ఎఫ్ఐఆర్ పొందవచ్చునన్నారు.
ఎన్.రాజశేఖర్, ఐ.పి.ఎస్, డైరెక్టర్, సిడిటిఐ కొత్త క్రిమినల్ చట్టాలలో చేసిన మార్పుల గురించి వివరించారు, ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కులపై ఎక్కువ దృష్టి పెట్టడం, న్యాయవ్యవస్థలో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, కనీస శిక్ష భావన, చిన్న నేరాలకు శిక్షగా సమాజ సేవను ప్రవేశపెట్టడం వంటి ప్రధాన మార్పులను ఆయన వివరించారు. అన్ని దర్యాప్తు ప్రక్రియలకు కాలపరిమితి విధించారని, పదజాలాన్ని పునర్నిర్వచించారని, ఉదాహరణకు ‘చైల్డ్’ అనే పదం ఇప్పుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని నిర్వచిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారని ఆయన అన్నారు. ఆర్ధిక నేరాలు, సైబర్ నేరాలని వ్యవస్థీకృత నేరాలుగా వర్గీకరించినట్లు తెలిపారు.
పత్రికా సమాచార కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ, పత్రికా సమాచార కార్యాలయం, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించడంలో దాని పాత్రను వివరించారు. బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త క్రిమినల్ చట్టాలకు కేంద్ర ప్రభుత్వం మెరుగులు దిద్దినట్లు తెలిపారు. దేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు జులై 1 నుంచి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి 1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లను కొత్త అంశాలతో రూపొందించి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలిపారు.