ఎయిర్ టాక్సీ తో పాటు అత్యవసర వైద్య సేవ లు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డ్రోగో డ్రోన్స్ సి ఈ ఓ యశ్వంత్ బొంతు తెలిపారు. దేశ వ్యాపితంగా 30 లక్షల ఎకరాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీకి ఇఫ్కో తో ఒప్పందం చేసుకోవటంతో పాటు వ్యవసాయ రంగంలో విస్తృతమైన సేవలు అందించే కృషీ 3 డ్రోన్ కు పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ (డి జి సి ఏ ) అనుమతులు లభించిన నేపథ్యంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన వివరించారు. సర్వే, మ్యాపింగ్, ఉత్పత్తుల రవాణా మరికొన్ని ఇతర రంగాలకు తమ సంస్థ డ్రోగో డ్రోన్స్ సేవలను విస్తరిస్తామని తెలిపారు. దేశ వ్యాపితంగా ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లో, ఆ తరువాత మండల కేంద్రాల్లో డ్రోన్ సర్వీస్ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు యశ్వంత్ తెలిపారు. డ్రోగో డ్రోన్స్ తాజాగా తయారు చేసిన కృషీ 3 ప్రో డ్రోన్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే నాలుగు ఎకరాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తుంది. పూర్తిగా మందును నింపితే 24 నిమిషాలు, ఖాళీగా 42 నిమిషాలు గాల్లో ఎగురుతుంది. ఇప్పటి వరకు దేశంలో ఉన్న డ్రోన్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు ఎకరాల్లో మాత్రమే మందులను పిచికారీ చేసే సామర్ధ్యం కలిగి ఉన్నాయి. నూతన డ్రోన్ తో రోజుకు 30 నుంచి 35 ఎకరాల్లో మందులను పిచికారీ చేయటంతో పాటు రైతులు 80 శాతం అధిక దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది. సాధారణ డ్రోన్ లను వినియోగించే పరిజ్ఞానం ఉన్న రైతులు కూడా క్రిషి డ్రోన్ ను ఆపరేట్ చేయవచ్చు. నూతన డ్రోన్ లో మందులను సమర్ధంగా పిచికారీ చేసే నాజిల్స్, ఓవర్ ఫ్లో ను తెలిపే సెన్సార్లు , డ్రోన్ ఆకాశంలో ఉన్నపుడు అవాంతరాలు ఎదురైతే అప్రమత్తం చేసే వ్యవస్థ ఇమిడి ఉన్నాయ్. డ్రోగో డ్రోన్స్ నూతనంగా ఆవిష్కరించిన, ఇప్పటికి అందుబాటులో ఉన్న తమ డ్రోన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని 30 లక్షల ఎకరాల్లో పురుగు నివారణ మందుల పిచికారీకి ఇఫ్కో సంస్థతో ఒప్పందం చేసుకుందని యశ్వంత్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో రైతులు డ్రోన్ సేవలు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. దేశ వ్యాపితంగా డ్రోన్ సర్వీస్ హబ్ ఏర్పాటుకు తాము పెట్టుబడులు పెట్టమని, వెయ్యి మంది వుపేటర్లకు శిక్షణ ఇస్తామని యశ్వంత్ వెల్లడించారు. డ్రోగో డ్రోన్స్ తమ సేవలు మెరుగుపరిచేందుకు ఏ ఐ సాంకేతితకను జోడిస్తున్నట్లు తెలిపారు. వచ్చె ఏడాదికి 200 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు యశ్వంత్ వివరించారు .
ఎయిర్ టాక్సీ సేవల్లోకి డ్రోగో డ్రోన్స్
డి జి సి ఏ అనుమతులకు దరఖాస్తు వచ్చే ఏడాదికి 200 కోట్ల ఆదాయం లక్ష్యం క్రిషి 3 ప్రో డ్రోన్ కు అనుమతిచ్చిన డి జి సి ఏ 30 లక్షల ఎకరాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీకి ఇఫ్కోతో డ్రోగో డ్రోన్స్ ఒప్పందం జిల్లా, మండల కేంద్రాల్లో డ్రోన్ సర్వీస్ హబ్ ఏర్పాటు లక్ష్యం డ్రోగో సి ఈ ఓ యశ్వంత్ బొంతు
58