నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్
హైదరాబాద్ : నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలను అరికట్టేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన, ఎరువుల దుఖానాలపై దాడులు నిర్వహించాలని కమిషనర్ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. విత్తనాల ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం, లోగో హోలోగ్రాం వంటి వాటిని పరిశీలించాలని, వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే షాపుల్లో అమ్మేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు గురువారం ఘట్ కేసర్ లోని ఏస్ ఇంజినీరింగ్ కళాశాలలో అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నకిలీ విత్తనాలను అమ్మేవారిపైన పిడి యాక్ట్ నమోదు చేయాలని, నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం, కట్టడి చేయడం, ఎవరు సరఫరా చేస్తున్నారు, ప్రైమరీ కాంటాక్ట్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఫర్టీలైజర్ షాపులపైన ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాపును క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని, అందుకే కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలను సమూలంగా కట్టడి చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు 92 కేసులు ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయని, 181 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
నూతన న్యాయ చట్టాలపై అవగాహన…
జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్న నేపథ్యంలో కేసుల దర్యాప్తు, విచారణలో పాటించవలసిన నూతన విధానాల మీద అధికారులు, సిబ్బంది అందరూ సంపూర్ణ పరిజ్ఞానం అవగహన కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులను అలవరచుకోవాలని ఆదేశించారు. నూతన నేరన్యాయ చట్టాలకు సంబంధించిన నూతన అంశాలను నేర్చుకోవడం కోసం పలు న్యాయశాస్త్ర గ్రంథాలను అన్ని పోలీస్ స్టేషన్లకు, డిసిపిలు, అదనపు డీసీపీలు, ఏసిపిలకు, ఇతర పోలీసు విభాగాలకు అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు నూతన చట్టాల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజేష్ చంద్ర, ప్రవీణ్ కుమార్, కరుణాకర్,ఇందిరా,అరవింద్ బాబు, చంద్రమోహన్, మురళీధర్,అదనపు డిసిపిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.