నెలకు 24 శాతం వడ్డీ అంటూ రూ.200 కోట్లు స్వాహా!
టెస్కాబ్ జనరల్ మేనేజర్‌గా పని చేసిన నిందితురాలు
బాధితుల్లో ఈ సంస్థకు చెందిన 147 మంది ఉద్యోగులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితుల సంఖ్య 532గా నిర్థారణ
హైదరాబాద్ :
తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో (టెస్కాబ్) జనరల్ మేనేజర్‌గా పని చేస్తూ శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ ముసుగులో రూ.200 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడిన నిమ్మగడ్డ వాణిబాలను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు అరెస్టు చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన 532 మందిలో 147 మంది టెస్కాబ్ ఉద్యోగులే అని డీసీపీ ఎన్.శ్వేత గురువారం తెలిపారు. ఈ కేసులో వాణ బాలతో పాటు ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్షలను సైతం రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985లో తిలక్‌రోడ్‌లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్‌ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. మరో వ్యాపారాలను చేసిన ఈయన వాటి నిర్వహణ కోసం ప్రియాంక సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమ వద్ద నగదు డిపాజిట్ చేస్తే నెలకు 24 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మబలికాడు. నేతాజీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి ఖరీదు చేసి, ప్రింటింగ్ ప్రెస్ వారికి విక్రయించడం మొదలెట్టారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత టెస్కాబ్‌గా మారిన ఈ సంస్థలో కొనసాగారు.రాష్ట్ర స్థాయి పోస్టు అయిన జనరల్ మేనేజర్ వరకు వెళ్లారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలోనే డైరెక్టర్‌గా చేరారు. వాణి బాల తన బ్యాంకులో పని చేసే ఉద్యోగులను భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధిక వడ్డీకి ఆశపడి 147 మంది రూ.26 కోట్ల డిపాజిట్లు చేశారు. టెస్కాబ్‌లో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చే వారితో వాణి బాల మాటలు కలిపేది. వారితో నమ్మకంగా మాట్లాడుతూ కష్టసుభాలు తెలుసుకునేది. ఆపై తమకు ఉన్న ఫైనా¯Œ ్స కంపెనీ విషయం చెప్పి… ఈ బ్యాంక్‌లో అయితే కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని చెప్పేది. ఆ మొత్తం ఈ రోజుల్లో ఏ ఖర్చులకూ సరిపోదని, తన భర్త, కుమారుడు నిర్వహిస్తున్న ప్రియాంక సంస్థలో డిపాజిట్ చేయాలని సూచించేది. తాము క్రమం తప్పకుండా 24 శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. తనకు టెస్కాబ్‌లో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేవని, మే నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో బతుకుతెరువు కోసం ప్రియాంక సంస్థ వ్యాపారాభివృద్ధి చేసుకుంటున్నానని నమ్మబలికింది. ఈ మాటలు నమ్మిన అనేక మంది పదవీ విరమణ చేసిన వాళ్లు తమ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను ప్రియాంక సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. మేక నేతాజీ, శ్రీహర్షలు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైౖ జెస్ పేరుతో రసీదులు తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి, రూ.1 విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి, సంతకాలు చేసి ఇచ్చారు. కరోన తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా… గతేడాది నవంబరు, డిసెంబర్ నుంచి వడ్డీలు చెల్లింపులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులు దివాళ పిటీషన్ (ఐపీ) దాఖలు చేసి ఆ మరుసటి రోజు నుంచి వాణి బాల, నేతాజీ, శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది. పరారీలో ఉన్న వాణి బాల, నేతాజీ, శ్రీహర్షలను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. తదుపరి విచారణ నిమిత్తం 14 రోజుల కస్టడీకి కోరాలని నిర్ణయించింది.