కిడ్నీ మార్పిడి జరిగిన రోగి వృషణాల్లో అరుదైన కణితి
40 సెంటీమీటర్ల పొడవు, డంబెల్ ఆకారంలో కణితి
సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
హైదరాబాద్: ఒక యువకుడి వృషణాల్లో అత్యంత అరుదైన, పెద్ద డంబెల్ ఆకారంలోని కణితిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఇప్పటికే ఈ రోగి కిడ్నీమార్పిడి చేయించుకుని,ఇమ్యునోసప్రెసెంట్ మందులు ఎక్కువ మోతాదులో వాడుతుండటంతో శస్త్రచికిత్స బాగా సంక్లిష్టంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కడప నగరానికి చెందిన 39 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఏడాది క్రితం మూత్రపిండాలు పూర్తిగా విఫలం కావడంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి అతడు శక్తిమంతమైన స్టెరాయిడ్లు,ఇమ్యునోసప్రెసెంట్లు వాడుతున్నాడు. ఇటీవల అతడికి ఎడమవైపు వృషణం వాపు వచ్చింది. దాన్ని సాధారణ హైడ్రోసిల్ అని పొరపడ్డాడు. అయితే వాపు క్రమంగా పెరిగిపోతుండటంతో స్థానిక వైద్యుల సూచన మేరకు ఏఐఎన్‌యూలో చూపించుకున్నాడు. అతడి ఎడమ వృషణం నుంచి బొడ్డు మీదుగా ఉదరభాగం వరకు పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడి బీటా హెచ్‌సీజీ స్థాయి అసాధారణంగా పెరిగిపోయింది. ఇది సాధారణ స్థాయి కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంది. అదృష్టవశాత్తు ఆ కణితి లక్షణాలు శరీరంలోని ఇతర భాగగాలు వేటికీ వ్యాపించలేదని పెట్ సీటీ స్కాన్‌లో నిర్ధారణ అయ్యింది.
ఈ రోగి ఇప్పటికే కిడ్నీ మార్పిడి చేయించుకుని, ఇమ్యునోసప్రెసెంట్ మందులు వాడుతుండటంతో కెమోథెరపీ, రేడియేషన్ లాంటి సంప్రదాయ చికిత్సలు ఏవీ పనిచేయవు. శస్త్రచికిత్స మాత్రమే చేయాలి.ముందుగా ఎనస్థీషియా,శస్త్రచికిత్స కోసం రోగిని సిద్ధం చేసిన తర్వాత..రోగికి జనరల్ ఎనస్థీషియాలో ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు.
కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్టు డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి అడపాల నేతృత్వంలో డాక్టర్ దినేష్ సహకారంతో శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ నిత్యానంద,డాక్టర్ షిఫా నేతృత్వంలో ఎనస్థీషియా బృందం అసాధారణ మద్దతు ఇ్వవడంతో శస్త్రచికిత్స చాలా సాఫీగా సాగింది. రోగి కోలుకోవడంలో అత్యంత కీలకమైన ఆపరేషన్ అనంతర నెఫ్రాలజీ సంరక్షణను డాక్టర్ శ్రీకాంత్ అందించారు.
శస్త్రచికిత్సలో భాగంగా సాధారణం కంటే కాస్త పెద్ద కోత పెట్టారు. ఎడమవైపు తొడ భాగం నుంచి ఉదర భాగానికి ఈ కోత పెట్టారు. తద్వారా లింఫ్‌నోడ్స్ వైపు ముప్పు విస్తరించకుండా జాగ్రత్త పడ్డారు. చుట్టుపక్కల ఉన్న మూత్రకోశం,ప్రధాన రక్తనాళాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా, విజయవంతంగా కణితిని తొలగించారు. దాదాపు 40 సెంటీమీటర్ల పొడవు, డంబెల్ ఆకారంలో ఉన్న ఈ కణితిని వీలైనంత తక్కువ రక్తస్రావంతో తొలగించడం విశేషం.
రోగిని తొలుత ఐసీయూలోకి తరలించి, మూడోరోజు డిశ్చార్జి చేశారు.“వృషణాల్లో కణితులు యువకుల్లో సాధారణమే. కానీ అవి ఇంత పెద్ద పరిమాణంలో పెరిగి ఉదరభాగం వరకు వెళ్లడం మాత్రం చాలా అరుదు” అని డాక్టర్ అడపాల తెలిపారు. ఈ రోగికి గతంలో కిడ్నీ మార్పిడి కూడా విజయవంతంగా ఏఐఎన్‌యూలోనే జరిగింది.ఇప్పుడు మరో సంక్లిష్ట శస్త్రచికిత్స సైతం ఇక్కడే పూర్తయింది.తమ బృందం సాధించిన ఈ అసాధారణ విజయం పట్ల ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సీ. మల్లికార్జున,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.