స్మారకోపన్యాసాలు నిర్వహణకు రూ.5 లక్షల డి.డి.ని యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డి. రవీందర్ కు అందచేసీన విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు అట్లూరి రవీంద్రాచారి.
హైదరాబాద్ :
సంఘసంస్కర్త, సర్వమతసమైక్యతను చాటి చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానతత్వంపై ఇక ప్రతి ఏడాది మే 17న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసాలు జరుగనున్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనా దినోత్సవం సందర్భంగా ఈ స్మారక ఉపన్యాసాలు జరుగుతాయి. ఈ స్మారకోపన్యాసాలు నిర్వహించేందుకు ఐదు లక్షల రూపాయల డి.డి.ని శుక్రవారం యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డి. రవీందర్ కు విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు అట్లూరి రవీంద్రాచారి అందజేశారు. యూనివర్శిటీ బ్యాంకులో ఈ డబ్బును ఫిక్స్ డిపాజిట్ చేయగా వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల చేత కాలజ్ఞాన స్మారకోపన్యాసాలు నిర్వహిస్తారు.
ఉస్మానియా వైస్ చాన్స్ లర్ డీ. రవీందర్ మాట్లాడుతూ.. వీరబ్రహ్మేంద్రస్వామి జీవితచరిత్ర, కాలజ్ఞానం బోధనలపై మొట్టమొదటి సారిగా ఉస్మానియా యూనివర్శిటీలో స్మారకోపన్యాసాలు పెట్టడం గర్వకారణం అన్నారు. ఇది తన చేతులమీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సిద్ధడ్ని, కక్కడ్నీకలుపుకుని కులమత భేదాలు లేని సమాజం కోసం కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మం తత్త్వాలు ఈ కాలానికి ఎంతో అవసరమైనవని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు అట్లూరి రవీంద్రాచారి బీ.సీ.కమీషన్ సభ్యులు ఉపేంద్ర, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజీష్ట్రార్ ఆచార్య టీ.గౌరీశంకర్, ఫౌండేషన్ సభ్యులు మహరాజా రవీంద్రాచారి, కీమోజు జితేందర్, సంకోజు రాఘవేందర్, కొలనూరు శ్రీనివాసాచారి, ప్రొ. వెంకటరాజలింగం తదితరులు పాల్గొన్నారు.