ఎన్నికలు సజావుగా సాగేలా భారీగా బందోబస్తు
– ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ తరుణ్ జోషి
హైదరాబాద్ : మే13న జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లను మరియు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఆదివారం పర్యవేక్షించారు. సైనిక్ పురి భవన్స్ కళాశాల, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, గుర్రగూడ లోని స్ఫూర్తి కళాశాల, మేడ్చల్ లోని హోలీ మేరీ కళాశాలలోని ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలకు సబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ మరియు భద్రత ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూము నుంచి కౌంటింగ్ కేంద్రానికి చేరుకునే మార్గంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అక్కడ ఏర్పాటు చేయాల్సిన గార్డు వ్యవస్థ గురించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ అధికారులు కలవకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు. మెటల్ బారికేడ్ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు వివరించి, వాటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక సూచనలు ఇచ్చారు. అవసరాన్ని బట్టి పలు వరుసలలో కౌంటింగ్ టేబుల్లు మరియు రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, మల్కాజి గిరి డీసీపీ పద్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.