మంచిని పంచడం కోసం..!
ఇది కథే కదా అనుకుంటే.. వినేవారుంటే.. కథలు చాలా చెప్పొచ్చనిపిస్తుంది. ఇది కథ అనే కంటే.. ఒక గొప్ప సత్యమనో మరేదో అనాలనిపిస్తుంది. దీనిని నేను ఎప్పుడో చదివాను. బాగా నచ్చింది. సందర్భం వచ్చినపుడల్లా మా పిల్లలకూ చెప్పాను. వారికి ఇంకా అర్థం చేసుకునే వయసు రాలేదు కానీ.. కొంత వరకైతే దాని గురించి ఆలోచిస్తారు అని చెప్పాను.. మా ప్రెండ్స్కి గానీ.. మా పక్కన ఉన్న వారికి కూడా చెప్పాను. వారికి కూడా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను..
మనం కష్టాలు వచ్చినపుడు.. మనం ఏం తప్పుచేశామో ఇలాంటి కష్టం వచ్చిందని అనునుకుంటుంటాం. మరోసారి నేనూ ఏ తప్పూ చేయలేదు.. ఇలాంటి కష్టం ఎందుకొచ్చిందని అనుకుంటాం. ఇంకా.. కొందరొచ్చి మంచి వాళ్లకే కష్టాలు అని నిట్టూరుస్తారు. పక్కకెళ్లి.. ఎంత మందిని ముంచాడో అని అనుకునేవారు కూడా ఉంటారు.. ఏదేమైనా.. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని, భరించగలిగేవాడికే కష్టాలని.. ఇలా ఎన్నో.. ఇదంతా మనం మనం సమాజంలో చూస్తూనే ఉంటాం కదా.. దీని గురించి ఒక చిన్న కథ మీకోసం చదవండి…
రెండు గ్రామాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఆ గ్రామాల్లో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఒక గ్రామంలోని వారు చాలా స్వార్థపరులుగా ఉండేవారు. ఆ గ్రామంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం గానీ.. లేని వాడికి పెట్టడం గాని చేసేవాళ్లు కాదు. చివరకు ఆ ఊరికి బంధువులు కూడా ఎవ్వరూ రారు… చివరకు భిక్షం అడుక్కునే వాడు కూడా రాడు… ఎందుకంటే వచ్చినా వాడి ఆకలి తీర్చేవారుండరు.
మరి రెండో గ్రామంలో ఉన్న ప్రజలు చాలా మంచి వారు. వీరు మొదటి గ్రామానికి పూర్తిగా భిన్నం.. ఈ ఊరిలో చక్కగా మర్యదాతో మాట్లడతారు. పరులకు సాయం చేయడంలో వీరు ముందుంటారు.. ఈ గ్రామంలోకి ఎవరొచ్చిన సకల మర్యాదలతో ఆథిత్యమిచ్చి వారిని సాగనంపేవారు. ఆతిథ్యమివ్వడంలో వీరికి వీరే సాటి.. అథితి దేవోభవకు ఈ గ్రామం చక్కటి ఉదాహరణ.
అయితే ఒకసారి ఒక సాధువు దేశ సంచారం చేస్తూ.. ఈ గ్రామాలను సందర్శిస్తాడు.. తొలుత స్వార్థపరులున్న గ్రామానికి వెళ్తాడు. అక్కడకు రాగానే ఆ ఊరిలో ఉన్నవారు ఆ సాధువును చూసి హేళన చేస్తారు. బిచ్చగాడని అవమానిస్తారు. అతనికి కనీసం తినడానికి తిండి కూడా పెట్టక పోగా.. పలు రకాలుగా అవమానాలకు గురి చేస్తారు. కానీ ఆ సాధువు వారిని ఏమీ అనలేదు. తిరిగి ఆ ఊరి నుండి వెళ్తూ.. మీరంతా సుఖంగా ఇక్కడే ఉండండి అని దీవించి వెళ్తాడు.
తర్వాత రెండో గ్రామ సందర్శనకు వెళ్తాడు ఆ సాధువు.. ఆ గ్రామంలోని వారు ఆసాధువును సాదరంగా ఆహ్వానించి, ఆతిథ్యమిస్తారు. సకల మర్యాదలతో సపర్యలు చేస్తారు.. ఆ సాధువు తినడానికి, ఉండడానికి అన్ని ఏర్పాట్లు ప్రజలంతా దగ్గరుండి మరీ చూసుకుంటారు. సాధువు అక్కడ ఉన్నన్ని రోజులు ఉండి.. ఇక బయలుదేరుతూ ఆ గ్రామ ప్రజలను “మీరు కష్టాలపాలై. తిండి లేక గ్రామన్ని వదిలి పోతారు..“ అని దీవించి వెల్లిపోతాడు..
దీంతో ఆగ్రామ ప్రజలు ఒక్కసారిగా అవాక్కయిపోతారు… ఏంటి ఈ సాధువును ఇంత మర్యాదగా చూసుకుని అన్ని సేవలు చేస్తే.. ఈ విధంగా శపించిపోతున్నాడని వారంతా ఆశ్చర్యపోతారు.
ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు ఆసాధువును ఆపి “తమను ఎందుకిలా శపించారని, పక్క గ్రామ ప్రజలను , ధన ధాన్యాలతో సుఖంగా జీవించమని దీవించారు. మమ్మల్నే ఇలా ఎందుకు శపించారని “ అడుగుతారు. మేము చేసిన అపరాధమేంటని అడుగుతారు. దీంతో ఆసాధువు వారితో ఇలా చెబుతాడు. ఆ గ్రామ ప్రజలు తిండి లేక వేరే ఊరికి వెళితే.. అక్కడి వారిని కూడా తమలా మర్చేస్తారు. అందుకే వారు ఎక్కడికీ వెళ్లకుండా.. అక్కడే ఉండిపోయేలా దీవించారు. మీరు చాలా మంచివారు. మీరు ఇతర ప్రదేశాలను సందర్శిస్తే.. మీ వల్ల అందరూ మంచివారుగా మారుతారు. మంచి అనేది విశ్వవ్యాప్తం అవుతుంది.. “మిమ్ములను చూసి ఇతరులు కూడా సేవ చేయాలనే తపన అలవాటు చేసుకుంటారు. మంచిని పంచడం కోసం… మిమ్మల్ని గ్రామం వదిలిపోవాలని దీవించాను..“ అని సాధువు సమాధానమిస్తాడు..
సంపద కలిగి సుఖంగా జీవించేవాడు సంతోషంగా ఉంటాడు. అలాగే సంపద లేని వాడు కూడా ఇతరుకలకు సేవచేస్తూ.. చాలా సంతోషంగా జీవిస్తాడు. అందరినీ సంతోషంగా జీవించేలా చేస్తాడు.
మానవసేవే మాధవసేవ!