గురుకులాల కార్యదర్శిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాను*
*ఎంపీగా గెలిపిస్తే నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా*
హైదరాబాద్ :
అధికారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు, మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు అడగనని,నిజాలు మాత్రమే ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతానని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ భారాస అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం వనపర్తి లోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో మాదిగల రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.గురుకులాల కార్యదర్శిగా కేసీఆర్ ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తీర్చిదిద్దానని తెలిపారు.గురుకులాల్లో చదివిన విద్యార్థులు పైలట్లుగా, ఇంజనీర్లుగా, నౌకలు నడిపే కెప్టెన్లుగా తయారు చేశానని తెలిపారు.డా.బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు అనే వజ్రాయుధంతో పేదల బతుకులు మార్చాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించానన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి ద్యేయంగా నిస్వార్ధంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు.
బిజెపి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే, రాజ్యాంగం రద్దవుతుందని అన్నారు. రాజ్యాంగం పేదల బతుకులు చీకటి యుగంలోకి వెళ్తాయన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు,దాడులు,హత్యలు అధికమయ్యాయని అన్నారు.ఎస్సీ వర్గీకరణ చేస్తానని బిజెపి హామీ ఇస్తే ఎమ్మార్పీఎస్ నాయకులు బిజెపికి మద్దతిస్తున్నారు.కానీ దళితులపై వివక్ష చూపుతున్న పార్టీ బిజెపినేనని అన్నారు. మణిపూర్ లో మహిళలపై దాడి చేసి నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపిదని విమర్శించారు.
మాదిగల ఆత్మీయ సభ ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదన్న ఆయన మాదిగలంతా రాజకీయంగా ఏకమై రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేసి, చట్టసభల్లోకి అడిగిడాలని కోరారు.తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంటులో గలం విప్పి, దశాబ్దాలుగా నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.