పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలి: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
ఎన్నికలలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైనది: జనరల్ అబ్జర్వర్ శ్రీవిద్య
హైదరాబాద్ :ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేయుటకు నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు సోమవారం బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసి భవన్ లో శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగల్గుతారన్నారు. ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు ఉదయం నిర్ణీత సమయంలోగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు.
మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రతి దశలో నిర్ణయాత్మకంగా ఉంటుందని, నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ జరగాలని,
పోలింగ్ రోజు ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30 గంటలకే మాక్ పోల్ ప్రక్రియ జరిగేలా చూడాలని, ఒకవేళ ఏజెంట్లు ఎవరూ హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చుసిన మీదట మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మాక్ పోల్, తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, ఉదయం పోలింగ్ ప్రారంభం నుండి సాయంత్రం పోలింగ్ పూర్తయి సీల్ అయ్యేంతవరకు జరిగిన వివరాల నివేదికను జనరల్ అబ్జర్వర్ కు అందించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలూ ఉన్నాయా లేవా అన్నది, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈ.వీ.ఎం లు పనిచేయకపోతే, వాటి స్థానంలో వేరే ఈ.వీ.ఎం లను ఎలా అమరుస్తున్నారు అన్నది పరిశీలన చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలన్నారు.
పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైకో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలకు సంబందించిన అంశాలను ఆయన వివరించారు. పూర్తి అవగాహనతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ పి.ఐ. శ్రీవిద్య మాట్లాడుతూ ఎన్నికలలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైనదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె
మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు.
మైక్రో అబ్జర్వర్ ల విధులు బాధ్యతతో కూడుకున్నవని,మైకో అబ్జర్వర్లు కళ్ళు, చెవుల లాంటి వారని పోలింగ్ కేంద్రాలలో ప్రతి అంశాన్ని పరిశీలించాలని, పోలింగ్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలాంటి సంఘటనలు జరిగినా, తమ నోటీసుకి తీసుకురావాలని తెలిపారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు పనిచేయాలని సూచించారు.
ఏలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. స్వేచ్ఛగా, ఎన్నికలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని, మైక్రో అబ్జర్వర్లు ప్రతి రిపోర్టును నేరుగా జనరల్ అబ్జర్వర్ కు ఇవ్వాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ ప్రక్రియ జరగాలన్నారు. సీసీ కెమెరా ఓటింగ్ కంపార్ట్మెంట్ వైపు ఉండకూడదని, ఆయా విషయాలన్నింటిని సూక్ష్మంగా పరిశీలించాలని తెలిపారు. అనంతరం ఈవీఎం, వీవీ ప్యాట్ ల నిర్వహణ పై మైక్రో అబ్జర్వర్లకు హాండ్స్ ఆన్ శిక్షణ నిచ్చారు. శిక్షణ తరగతుల్లో మైక్రో అబ్జర్వర్లు,జిల్లా ఎన్నికల ట్రైనింగ్ నోడల్ అధికారి అడిషనల్ కమిషనర్ (యు బి డి)సునంద,
ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.