Hindu Temple in UAE: అరబ్ ఎమిరేట్స్‌లో అతి పెద్ద హిందూ దేవాలయం రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) పేరిట అబుదాబిలో ఏడు గోపురాలతో హిందూ దేవాలయ నిర్మాణం చేపట్టారు. అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్స్‌కు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామినారాయణ్ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ ఆలయంలోని దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి విశిష్ట అతిథిగా నరేంద్ర మోడీ ఇప్పటికే యుఎఇకి చేరుకున్నారు.
దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో సుమారు మూడేళ్లుగా శ్రమించి ఈ ఆలయం నిర్మించారు. రాజస్థాన్ నుండి పాలరాయి తెప్పించి ఈ దేవాలయ నిర్మాణంలో వినియోగించారు. దుబాయి- అబుదాబి మార్గంలో 55 వేల చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణం జరిగింది. ఈ ఆలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది. 32.92 మీటర్లు (108 అడుగులు) ఎత్తు, 79.86 మీటర్లు (262 అడుగుల) పొడవు, 54.86 మీటర్లు (180 అడుగులు) వెడల్పుతో ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫలకాలపై రామాయణం, శివ పురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామి నారాయణుడు, వేంకటేశ్వరుడు, అయ్యప్ప కథలను వర్ణించారు.