హైదరాబాద్ : జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 19 రోజులు 40 నుంచి 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో నేతలు ఓవైపు వేడిని భరించలేక, మరోవైపు ఓటర్లను సకాలంలో కలవలేక ఏంచేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికితోడు ప్రచార సమయం కూడా తక్కువగా ఉండటంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల యత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం కల్యాణ మండపాల్లో సమావేశాలు: జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుండగా, కొడంగల్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తోంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు, అనుయాయులు మైకులు అందుకుందామనుకున్నా, ఎండ దెబ్బతో ప్రజలను సమీకరించడం కష్టమవుతోంది. దీంతో ఉదయం 11 గంటల లోపు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు గ్రామాలు, తండాలు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ఎక్కువగా ఉదయం 11 గంటలలోపే ప్రచార కార్యక్రమాలు ముగించేసుకొని, మధ్యాహ్నం కల్యాణ మండపాల్లో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి తమ వాణి వినిపించేందుకు తాపత్రయపడుతున్నారు.
33
previous post