Home గెస్ట్‌కాల‌మ్స్‌ విద్య‌కు సాంకేతిక‌త తాప‌డ‌ము అద్దుతున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్ష‌లు

విద్య‌కు సాంకేతిక‌త తాప‌డ‌ము అద్దుతున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్ష‌లు

by live
0 comment

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలుజాతీయ విద్యా విధానం 2020 దాదాపుగా మన దేశమంతా అమలులోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఆచరణలో కొంత వెనుకాముందు అయినప్పటికీ, దేశమంతా ఒకే విద్యా విధానం ఉండాలి అనే భావన తో రూపొందించిన ఈ విధానం అనూహ్యమైన ఆదరణను అందుకుంటుంది, ఆశించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది అనే అభిప్రాయం లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పటివరకు ఉన్న విద్యా వ్యవస్థను సమీక్షిస్తూ విజయాలను అపజయాలను పరిగణలోకి తీసుకుంటూ పటిష్ఠమైన భావిభారత సమాజ నిర్మాణం కొరకు క్రియాశీలకమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉపాధ్యాయుల పైననే ఉంచింది. ఇది యావత్ ఉపాధ్యాయలోకానికి దక్కిన గౌరవం.

కావున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ యొక్క విద్యా విధానాన్ని సమగ్రంగా నిర్మించడం కొరకు మనసా వాచా కర్మణా పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే కొన్ని సంవత్సరాల పాటు కోట్లాదిమంది భావిభారత పౌరులు అసమగ్రంగా విద్య పూర్తి చేసుకొని బయటికి వచ్చి సమాజ పరిపూర్ణ నిర్మాణంలో ఆశించిన విజయం సాధించలేకపోవచ్చు. ఆ అపవాదు తప్పకుండా ఉపాధ్యాయులుగా మనమే భరించాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో మంది ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, జాతీయస్థాయిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయా ప్రభుత్వాల చేతుల మీదుగా ఎంతో గౌరవంగా, అధికారికంగా అవార్డులు అందుకుంటున్నారు, ఆ సమయంలో ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఏమిటంటే

“ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది, నేను ఇంకా ఎంతో కష్టపడి పని చేస్తాను”.

ఆ విధంగా అన్నంత మాత్రాన సరిపోదు, ఆచరణలో పెట్టాలి, పని చేయాలి, ఫలితాలు రాబట్టాలి, సమీక్షలు చేపట్టాలి, సరైన ఫలితాలు వచ్చే వరకు నిర్విరామంగా, నిస్వార్ధంగా పని చేయాలి.

జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఎంతోమంది మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయాలను కొనసాగించవలసిన అవసరం ఉంది. ఒకవేళ మన ఉపాధ్యాయ లోకమంతా చిత్తశుద్ధితో అంకితభావంతో పని చేసినట్లైతే నేటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించి వారిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించినట్లయితే యావత్ ప్రపంచంలో మన భారత దేశము అగ్రగామిగా నిలుస్తుంది.. ప్రపంచానికి సరైన మార్గనిర్దేశనం చేయగలుగుతుంది.. కాబట్టి మన దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయగలిగే స్థితికి భారతదేశాన్ని తీసుకుపోవడానికి అవకాశం ఉపాధ్యాయులకు దక్కింది.

తప్పకుండా ఈ విషయంలో ఎంతో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎంతో అంకితభావంతో పనిచేసి, ఎంతోమంది గొప్ప పౌరులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు ఎంతోమంది మన భారతదేశ విద్యాభివృద్ధికి పురాతన కాలం నుండి పునాదులుగా నిలిచి ఉన్నారు. అవార్డులు రానంత మాత్రాన, వారు వెలుగులోకి రానంత మాత్రాన వారిని మనం విస్మరించడానికి వీలు లేదు.

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో భారతదేశంలోని శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించి తయారు చేసిన వాక్సిన్, ఎన్నో దేశాలను ఆపద నుండి ఆదుకొని ఆదర్శంగా నిలిచింది. మనదేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు, ఇక్కడ ఉన్న విద్య, విజ్ఞానం, స్వతహాగానే భారతీయులను అత్యంత తెలివిగల, బాధ్యతగల వ్యక్తులుగా నిర్మాణం చేయగలుగుతుంది అన్న విషయం పురాతన కాలం నుండి వస్తున్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. ఇంతటి గొప్ప సంస్కృతి సంప్రదాయాలు ఉన్న దేశంలో మనము కీలకంగా వ్యవహరించినట్లు అయితే, ఎంతో ప్రగతిని సాధించవచ్చు అన్న విషయం గ్రహించాలి. ఎంతోమంది నిపుణులు రూపొందించిన విద్యా విధానం ఇప్పుడు ఆధునికత సాంకేతికత సమగ్రత తాపడము అద్దుకోబోతుంది. దానికి శిల్పుల వలె పని చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది అన్న విషయం ఉపాధ్యాయ లోకమంతా ఈరోజు గుర్తించి పని చేయడానికి ప్రతిజ్ఞ చేయాలి.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకుంటున్న… అలాగే వృత్తినే  దైవంగా భావించి పని చేస్తున్నప్పటికీ అవార్డులను తృణప్రాయంగా వదిలేస్తున్న మహోన్నత వ్యక్తిత్వం గల మహానుభావులైన ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

-అడ్డిచర్ల సాగర్
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, తెలంగాణ

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4