Home గెస్ట్‌కాల‌మ్స్‌ లక్ష్యాన్ని సాధించడమెలా?

లక్ష్యాన్ని సాధించడమెలా?

by live
0 comment

అసలు ‘లక్ష్యం’ అంటే అర్థం ఏమిటి ? సమాజం గౌరవించేలా జీవితంలో మంచి స్థానంలో ఉండడం.. లేదా మీరు ఏం చేయాలనుకంటున్నారో దాన్ని చేసేయడం.. లేదా.. మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని పొందడం… అంతేనా ? సరే, ఉదాహారణకు మీరు విద్యార్థి అయితే ఈ రోజు స్కూల్లో చెప్పిన ెంవర్క్‌ను పూర్తి చేయడమే మీ లక్ష్యం. లేదంటే రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి అనేది మీ స్వల్పకాలిక లక్ష్యం. ఒకవేళ మీరు ఉద్యోగి అయినట్లయితే… ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలి, కారు కొనుక్కోవాలి, మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువులతో ఇళ్లును అందంగా అలకరించుకోవాలనేది మీ లక్ష్యం కావొచ్చు. ఏదేమైనా, జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి మనిషికి క్రమపద్ధతిలో లక్ష్యాలు ఉండడం ఎంతైనా అవసరం. మీకు ఎటువంటి లక్ష్యాలు లేనట్లయితే మీ జీవితానికి అర్థం లేదు. మీ పుట్టుకకు సార్థకత లేదు. కాబట్టి ప్రతి మనిషి తప్పకుండా లక్ష్యాలను కలిగి ఉండాలి. మరో విషయం లక్ష్యం ఉండాలి కదా ! అని ఏదో లక్ష్యం పెట్టుకుని కూర్చుంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. దాన్ని సాధించేందుకు పటిష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అందుకు అనుగుణంగా కష్టపడాలి.

లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి

ఎటువంటి లక్ష్యాలు లేకుండా ఉంటే మీరు ఏదీ సాధించలేరు. అందుకే ముందు మీరు సాధించాలనుకున్న లక్ష్యాల జాబితాను రూపొందించండి. అవి స్వలకాలికమైనవి కావొచ్చు, దీర్ఘకాలికమైనవి కావొచ్చు. మీరు నిర్ధారించుకున్న లక్ష్యాలపై మీకు పూర్తి స్పష్టత ఉండాలి. స్పష్టత లేని లక్ష్యాలను సాధించలేరు. అదేవిధంగా మీరు నిర్ధారించుకున్న లక్ష్యాలు కూడా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. అంతేకాదు దాని వల్ల మీకు ఉపయోగం ఉండాలి. వాస్తవదూరపు లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు రూపొందించుకున్న లక్ష్యాల జాబితాలో వాటి ప్రాధన్య క్రమాన్ని గుర్తించండి. లక్ష్యాలకు ప్రాధాన్యత క్రమంలోనే నెంబర్లను కేటాయించండి. వాటిని సాధించేందుకు మీకున్న సమయాన్ని కూడా పక్కన రాయండి. దీనివల్ల మీ లక్ష్యాలపై మీకు అవగాహన, స్పష్టత పెరుగుతుంది. దీనివల్ల మీరు మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి మీ లక్ష్యాలను సాధించగలుగుతారు.

సామర్థ్యాలను పెంచుకోవాలి

మీరు లక్ష్యాల జాబితాను రూపొందించుకున్న తరువాత దాన్ని సాధించేందుకు మీలోని సామర్థ్యాలను పెంచుకోవాలి. లక్ష్యం సాధించేందుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధులు కావాలి. ఎస్‌ఐ కావడమే మీ లక్ష్యమైతే.. ప్రతి రోజు పరుగెత్తడం సాధన చేయాలి. వ్యాయామం చేయాలి. ఆరోగ్యవంతంగా ఉండాలి. అంతేకాదు ఎస్‌ఐ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను బాగా చదవాలి. ఇలా ఉద్యోగానికి కావాల్సిన సామర్థ్యాలను మీరు అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే శిక్షణ తీసుకోవాలి. ఇదే రంగంలో ఉన్న వారి సలహాలు కూడా పాటించాలి. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించగలరు. అంతేగానీ ఏదీ కూడా తనంతట తానుగా మీ వద్దకు రాదనే విషయాన్ని గుర్తించాలి. లక్ష్యాన్ని సాధించాలంటే దానిపై అంకితభావం కూడా ఉండాలి.

ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి

లక్ష్యం సాధనలో ప్రణాళిక చాలా కీలకం. లక్ష్య సాధనకు ఉన్న సమయాన్ని బట్టి ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రణాళిక ప్రకారం ప్రతి రోజూ లక్ష్యం కోసం పనిచేయాలి. ఏదైనా కారణాలచేత మీరు మీ ప్రణాళికను నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం లక్ష్యంపై పడుతుంది. ఉదాహారణకు మీరు బరువు తగ్గాలనుకున్నారు. అందుకు తగిన ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. అలా కాకుండా మీరు మీకిష్టమైన ఆహారాన్ని పుష్టిగా తింటూ, ప్రతి రోజూ 10గంటల వరకు నిద్రపోయారనుకోండి. మీరు బరువుతగ్గాలనుకోవడం భ్రమే అవుతుంది.

మిమ్మల్ని మీరు నమ్మండి

జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. నేను సాధించగలను అనుకున్నప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రపంచంలో గొప్ప స్థానాల్లో ఉన్నవారందరూ కూడా వారిని వారు నమ్మినవారే. మీ శక్తి, సామర్థ్యాలపై మీకు నమ్మకముంటే ప్రపంచంలో దేన్నైనా సాధించగలరు. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయానికి పెట్టుబడి.

అభివృద్ధిని సమీక్షించండి

ప్రణాళిక ప్రకారంగా లక్ష్యం వైపు దూసుకెళ్లేటపుడు మధ్యమధ్యలో మీ ప్రగతి మీరు సమీక్షించుకోండి. ప్రతీవారం మిమ్మల్ని మీరు సమీక్షించినట్లయితే మీ లోపాలను మీరు గుర్తించగలరు. మీరు లక్ష్యం వైపు ఎంత దూరం ప్రయాణించారో తెలుసుకుంటారు. లోపాలను పునరావృతం చేయకుండా వాటిని అధిగమించండి. ఇందుకు అవసరమైతే కుటుంబసభ్యులు, శిక్షకుడు, మిత్రులు, ఇంకా మీకు అందుబాటులో ఉన్న నిష్ణాతుల సహాయాన్ని తీసుకోండి. లక్ష్య సాధనకు కావాల్సిన పరిష్కారాన్ని కనుగొండి.

మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి

లక్ష్యం సాధించాలంటే మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. మీరు ప్రణాళిక బద్ధంగా కష్టపడిన రోజున మీ భుజాన్ని మీరే తట్టుకుని శభాష్ అనుకోండి. మిమ్మల్ని మీరే అభినందించుకోండి. దాని వల్ల మీలో ఉత్సాహం మరింత పెరుగుతుంది. అంతే కాదు సెల్ఫ్ మోటివేషన్‌కు సంబంధించి మార్కెట్లో చాలా పుస్తకాలు సీడీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించండి. మీకు మీరు ఉత్సాహాన్ని తెచ్చుకున్నట్లయితే మీరు సులభంగా లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అంతేకాదు అనుకున్నదాని కంటే ముందుగానే లక్ష్యానికి చేరువవుతారు. ఆల్ ద బెస్ట్.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4