హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లను తొలగించేందుకే 400 సీట్లు కోరుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని వివరించారు. దాని ద్వారానే దళితులు, గిరిజనులకు అవకాశాలు వచ్చాయని తెలిపారు.
‘‘దేశంలో సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతోంది. జనాభా దామాషా ప్రకారం ప్రజలు వనరులు పొందలేకపోతున్నారు. దాని ప్రకారం వనరులను మేం సమానంగా పంచుతాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దేశంలోని 90 శాతం ప్రజల హక్కులు కాలరాసేందుకు చూస్తున్నారు. హక్కులను కాపాడుకునేందుకు ఓటు ద్వారా హస్తం పార్టీని నిలబెట్టుకోవాలి. కాషాయ పార్టీకి ఓటు వస్తే భవిష్యత్తు లేకుండా పోతుంది. ఆ పార్టీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. ఆర్‌ఎస్‌ఎస్ దేశం కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తోంది. రాష్ట్రంలో భాజపాకు స్థానం లేకుండా చేయాలి. దేశంలో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా బలహీన వర్గాలు కృషి చేయాలి’’ అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
34
previous post