Naypyidaw: మయన్మార్ నుండి వందల సంఖ్యలో సైనికులు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. మయన్మార్‌లో కొంతకాలంగా కల్లోల పరిస్థితులు నెలకొనడంతో మిలిటరీ పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది. దీంతో ఆదేశ ఆర్మీకి చెందిన వందల మంది సైనికులు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. మిజోరాం సరిహద్దు ప్రాంతం నుండి భారత్‌లో వస్తున్నారు. వారిని తిరిగి వెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది.
మయన్మార్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి మిలిటరీని ఎదురిస్తున్నారు. ఈ ఘర్షణల వలన ఇప్పటి వరకు 600 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్దుహోమా.. కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో చర్చించారు. మయన్మార్ నుండి వస్తున్న సైనికులకు మానవతా దృక్ఫథంతో సహాయం అందించాం. ఇంకా అక్కడి నుండి సైనికులు వస్తూనే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 400 మందిన వెనక్కి పంపించామని.. మీడియాకు వెల్లడించారు.
మయన్మార్ నుండి సైనికులు భారత్‌లోకి ప్రవేశించడం కలవరం సృష్టిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దీన్ని అరికట్టేందుకు సరిహద్దు వద్ద కంచె వేస్తామని మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు ఇరుదేశాల సరిహద్దుల్లో ప్రజలు ఎలాంటి తనిఖీలు లేకుండా వెళ్లే వారని.. ఆ ముసుగులో ప్రస్తుతం మయన్మార్ వాసులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారన్నారు. దీనికి ముగింపు పలుకుతామని తెలియజేశారు.