జులై 24న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ రానున్నారని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్, నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి. సోమవారం నాడు ఆయన ఢిల్లీ లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీనాడు ఢిల్లీ లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు సమావేశమయ్యి రాష్ట్రంలో చేపట్టిన కులగణన,బీసీ లకు 42% రిజర్వేషన్ అంశాలపై వారికి వివరించి వారి సలహాలను, సూచనలను స్వీకరించనున్నారని తెలిపారు.. అనంతరం సాయంత్రం 5 గంటలకు కులగణన, బీసీ రిజర్వేషన్లపై ఇందిరా భవన్ లో దేశంలోని కాంగ్రెస్ ఎంపీలందరికీ సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చర్చించాలని కోరనున్నారని తెలిపారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరపాలని పట్టుబడితే పదే పదే సభను వాయిదా వేస్తున్నారని చెప్పారు. వాస్తవాలు దేశ ప్రజలకు తెలియజేయాలని తాము కోరామన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కానీ.. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.
ఈ మీడియా సమావేశంలో డా. మల్లు రవితో పాటు ఎంపీలు రామసహాయం రఘరామ్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి,గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.