ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల వివాదాస్పద కొఠియా గ్రామాల గిరిజనులు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కొఠియా గ్రామస్థులకు ఇరు రాష్ట్రాల్లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
ఒకే రోజు రెండు చోట్ల ఓటు – నేరడివలసలో పోలింగ్ కేంద్రం
సిమిలిగూడ :
ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల వివాదాస్పద కొఠియా గ్రామాల గిరిజనులు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడి 21 గ్రామాల గిరిజనులకు రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లున్నాయి. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే కొన్ని దశాబ్దాలుగా రెండేసి ఓట్లు వేస్తున్నారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలో కొఠియా పంచాయతీ ఉంది. ఈ ప్రాంతం ఒడిశా రికార్డుల్లో, ఆంధ్రాలోని మన్యం జిల్లా సాలూరు మండలం రికార్డుల్లోనూ ఉంది.
కత్తి మీద సాములా పోలింగ్
మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు ఒకేరోజు ఉండడంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణ కత్తి మీద సాములా మారింది. నాడు బ్రిటిష్ వారు చేసిన తప్పు కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ గ్రామాలు కొన్ని దశాబ్దాలుగా వివాదంలో చిక్కుకున్నాయి. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది. 1996లో మధ్యంతర ఎన్నికల సమయంలో ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు ఒకేరోజు ఎన్నికలు జరగ్గా, అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్ల పరస్పర చర్చలతో వేరే ఇంకులు ఉపయోగించడంతో గిరిజనులు రెండుచోట్ల ఓటు వేశారు. మళ్లీ ఇప్పుడు ఒకేరోజు పోలింగ్ జరగడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒడిశా అధికారులు ఆ గ్రామాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఒడిశాలో గతంలో మాదిరి ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా చూస్తామని పొట్టంగి సమితి అధ్యక్షుడు సుకాంత్ కుమార్ పట్నాయక్ తెలిపారు.
ఇద్దరు ఎంపీలు…. ఇద్దరు ఎమ్మెల్యేలు
ఈ 21 గ్రామాల గిరిజనులకు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలుంటారు. ఒడిశాలో కొరాపుట్ లోక్‌సభ, పొట్టంగి అసెంబ్లీ సెగ్మెంట్, ఆంధ్రాలోని అరకు లోక్‌సభతోపాటు సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొఠియా గ్రామాలున్నాయి. అరకు లోక్‌సభ స్థానం నుంచి 13 మంది, సాలూరు ఎమ్మెల్యే స్థానానికి ముగ్గురు, కొరాపుట్ లోక్‌సభ స్థానం నుంచి 10 మంది, పొట్టంగి నియోజకవర్గంలో 9 మంది పోటీ చేస్తున్నారు. ఆంధ్రా నుంచి 2,554 మంది ఓటర్ల కోసం నేరేడివలస, శిఖపరుపు, కుర్కుటిల్లో, ఒడిశా నుంచి 5,502 మంది ఓటర్ల కోసం కొఠియా, గంజాయి పొద్రొ, పట్టు చెన్నేరు, మద్కర్, నేరేడి వలస, రణసింగ్, టౌపొద్ర, గల్లిగబ్దర్, గేమెల్ పోద్రొల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రెండు రాష్ట్రాల ద్వారా ప్రయోజనం
రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనం పొందుతున్నాం. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటా. ఎవరు అడ్డుకున్నా ఓట్లు వేసే తీరుతాం.
ఉదయం ఒడిశాలో.. మధ్యాహ్నం ఆంధ్రాలో
సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల పోలింగ్‌లో పాల్గొంటాం. ఉదయం ఒడిశాలో, మధ్యాహ్నం ఆంధ్రాలో ఓట్లు వేస్తాం. తరతరాలుగా ఈ విధానం కొనసాగిస్తున్నాం. ఎవరి ఒత్తడికి లొంగం అంటున్నారు.