-లక్ష మంది వస్తారని అంచనా
విజయవాడ : ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈనెల 6న రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన విజయ శంఖారావం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోనున్నారు.బి,తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన సుమారు లక్ష మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నారు. గతంలో మహానాడు బహిరంగ సభ జరిగిన ప్రదేశంలోనే ఈ సభ జరగనుంది. ఎలాంటి తుఫాను, గాలి వానలు వచ్చినప్పటికీ చెక్కుచెదరని అధునాతన వేదికను సిద్ధం చేస్తున్నారు. అలాగే భారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు వచ్చేందుకు అనువైన హెలీ ప్యాడ్ ప్రదేశాలను గురువారం ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా పి.జగదీష్, ఎఎస్పీలు అనిల్ కుమార్,రాజకుమార్ రాజు, జాయింట్ కలెక్టర్ తేజ భరత్ లు పరిశీలించారు. నాలుగు ప్రదేశాలను హెలీ ప్యాడ్లు కోసం ఐజి సందర్శించారు. తొలుత ఆంధ్రభూమి యూనిట్ వెనుక ఉన్న లేఔట్ ను పరిశీలించారు. అయితే అక్కడ చెట్లు అధికంగా ఉన్నాయని గుర్తించారు. అలాగే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యకర్తల సమావేశాలు జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అక్కడ చెట్లు లేకపోవడంతో మూడు హెలీ ఫ్యాడ్లు ఏర్పాటుకు అనుకూలంగా ఉందని గుర్తించారు. అలాగే బస్సులు, కార్లు,ఆటోలు, మోటారు సైకిల్లు పార్కింగ్ సంబంధించి పలు ప్రదేశాలను పోలీసు, రెవెన్యూ ఇతర అధికార యంత్రాంగం పరిశీలించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ కాశీ రాజు ఈ బహిరంగ సభకు సంబంధించి అధికారులతో చర్చించారు.ఎంతమంది ప్రజలు వస్తారు, ఎన్ని కార్లు, బస్సులు రావచ్చు అనే విషయాలు ముందే చెబితే అందుకు సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తామని ఐజి అశోక్ కుమార్ బిజెపి నాయకులకు సూచించారు.ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ట్రాఫిక్ నిలిపి చేస్తామని అందువల్ల ముందు గానే ప్రజలు సభా స్థలానికి వచ్చేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ బహిరంగ సభ ఏర్పాటు పరిశీలించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహరావు, జిల్లా పంచాయతీ అధికారి డి.రాంబాబు, సౌత్ జోన్ డిఎస్పీ అంబికా ప్రసాద్, కడియం సిఐ తులసీ దాస్, కడియం, రాజమహేంద్రవరం రూరల్ ఎంపిడివొలు జి.రాజ్ మనోజ్, డి.శ్రీనివాసరావు, తాసిల్దార్ రమాదేవి,జిల్లా బిజెపి అధ్యక్షులు బొమ్మల దత్తు,రూరల్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ ఆకుల శ్రీధర్ తదితరులు ఉన్నారు.