పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పిస్తూ పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచన
సంయమనం.. సమయస్ఫూర్తి పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని హితవు
విశాఖపట్టణం : ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఆర్వోలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని.. ప్రధాన భూమిక పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున పేర్కొన్నారు. సంయమనం.. సమయస్ఫూర్తి పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఏ చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని.. అన్నింటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎన్నికల సన్నద్ధతపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు అంశాలపై ఆర్వోలకు దిశానిర్దేశం చేశారు. సెక్టోరల్, రూట్ అధికారులతో సమన్వయం వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించాలని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చిన్నపాటి తప్పు కూడా జరగడానికి వీలు లేదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం.. నిర్లిప్తత కుదరదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపైనా క్షుణ్నంగా అవగాహన పెంచుకోవాలని, నిబంధనలు తు.చ. పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రం లోపల, బయట కనీస వసతులు కల్పించాలన్నారు. క్యూ లైన్ల వద్ద ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు సమకూర్చాలని చెప్పారు. వృద్దులు, వికలాంగులకు సహాయం అందించేలా ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి వాలంటీర్లను అందుబాటులో ఉంచుకోవాలని, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అటు ఓటర్ల నుంచి గానీ, విధులు నిర్వహించే సిబ్బంది నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని, ఆ మేరకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని కోణాల్లో ఆలోచించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ, ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై సూచనలు చేసిన ఆయన సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఓటర్ స్లిప్పులను నిర్ణీత సమయంలో అందజేయాలని చెప్పారు.
పోలింగ్ రోజున ఓటర్లకు సహాయం అందించే విధంగా హెల్ప్ డెస్కును ఏర్పాటు చేయాలని, అందులో బీఎల్వోను అందుబాటులో ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. అక్కడే ఏఎన్ం కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వెలుపలా పోటీ చేసే అభ్యర్థులతో కూడిన పోస్టర్, ఓటరు గైడ్ పత్రాలను గోడకు అతికించాలని సూచించారు. విధులకు హాజరయ్యే వారికి తాగునీరు, అల్పాహారం, భోజనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్వోలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్యూ లైన్లలో ఓటర్ల సంఖ్య ఎక్కువైతే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సరిపడా పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. క్లిష్టతరమైన పోలింగ్ కేంద్రాల వద్ద లోపల, బయట కూడా వెబ్ కాస్టింగ్ పెట్టాలని, సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నొక్కి వక్కానించారు. సాక్షం యాప్ ద్వారా సంప్రదించిన వృద్ధులు, వికలాంగులకు వీల్ ఛైర్ ఏర్పాటు చేయాలని, వాలంటీర్ను కేటాయించాలని చెప్పారు.
పోలింగ్ రోజున, ముందు రోజు ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందుగానే సైలెంట్ పిరియడ్ అమల్లోకి వస్తుందని ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం కూడా సైలెంట్ పరియడ్ లో భాగంగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. అయితే పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజున పత్రికల్లో ప్రచురించాలనుకునే ప్రకటనలకు తప్పకుండా ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్వోలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పలు అంశాలపై ఆర్వోలకు సూచనలు చేశారు. సమావేశంలో ఎంసీసీ నోడల్ అధికారి సీఎం సాయికాంత్ వర్మ, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె.ఎస్. విశ్వనాథన్ వివిధ నియోజకవర్గాల ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.