తాడేపల్లి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే….కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు వైయస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. అందులో పస లేదు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఒక అవాస్తవమైన ఇమెజ్‌ను చూపాలని ప్రయత్నం చేసింది. మేం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఏదేదో జరిగిపోతుందని, ప్రపంచంలోని చెడు అంతా ఇక్కడే ఉన్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ రోజు అమిత్‌షా కూడా నిత్యం చంద్రబాబు వల్లెవేసేవే చెప్పారు. కూటమిలో పార్టనర్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తరువాత విమర్శించాలి కాబట్టి విమర్శించారు. వాళ్లు అనుకుంటున్న అవకతవకలు ఉంటే ఎత్తి చూపవచ్చు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా చదివారు. అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయిందని ఆరోపించారు.
రాష్ట్రంలో కరోనా సంక్షోభ సమయం తీసేస్తే మిగతా సమయంలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆపలేదు. కరోనా సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం యాక్టివ్‌గా పని చేసింది. ఎక్కడా జరగని విధంగా నేరుగా రూ.2.70 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. కార్పోరేట్ స్కూల్స్,ఆస్పత్రులతో సమానంగా వీటికి లెక్కలున్నాయి. మేం గర్వంగా చెబుతున్నాం..పారదర్శకంగా, అర్హులకు దళారులకు ప్రమేయం లేకుండా ఇవ్వడం జరిగింది. కొత్తగా టేకప్ చేసిన ప్రాజెక్టుల్లో కూడా పారదర్శకంగా చేపట్టాం. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. అమిత్ షా ఓ పొలిటికల్ లీడర్‌గా మాట్లాడితే మాట్లాడవచ్చు. వాటిలో వాస్తవాలను వివరించడం మా బాధ్యత అని సజ్జల అన్నారు.
రాష్ర్టంలో 2014-2019లో అవినీతి జరిగింది. ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ఆ పాపం నుంచి బిజేపి ఎలా తప్పించుకుంటుంది. మీ అవినీతిని సహించలేకే ప్రజలు 2019లో మీ కూటమిని తిరస్కరించారు. చంద్రబాబు అవినీతిని సహించలేక టీడీపీని తిరస్కరించారు. అలాంటి పార్టీతో ఇవాళ బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది.
పోలవరం ప్రాజెక్టును వైయస్ జగన్ ప్రభుత్వం డిలే చేస్తుందని అమిత్ షా మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని విమర్శించారు. 2014 నుంచి 2017 వరకు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు. ఆ రోజు చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకున్నారు. పోలవరం కు సంబంధించి నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారు. 2015-2016 రేట్ల ప్రకారం చంద్రబాబు వారికి కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. అందులో అంతా అవినీతే జరిగింది. వర్క్ జరగకపోయినా అడ్వాన్స్ ఇచ్చారు. ఉన్న కాల్వనే వెడల్పు చేసి కాపర్ డ్యామ్‌ను తీసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు తన ఆదాయం కోసం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు. నీటిని మళ్లించకుండ, కాఫర్ డ్యామ్‌ను క్లోజ్ చేయలేదు. నీళ్లు రావడంతో స్పిల్ ఛానల్ దెబ్బతినింది. ఈ విషయాలన్ని ప్రధానికి, అమిత్‌షాకు తెలుసు.
వైయస్ జగన్ వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి రూ.850 కోట్లు సేవ్ చేశారు. కేంద్రం సకాలంలో నిధులు ఇస్తే రెండేళ్లు అవసరం లేదు. ఏడాదిన్నరలోపునే పోలవరాన్ని పూర్తి చేస్తారు. మార్చి 7వ తేదీ నాటికి రూ.12,900కోట్లు మొదటి దశకు సంబంధించి కేబినెట్ నోట్ కూడా రెడీ అయ్యింది. ఆ తరువాత వీరి పొత్తు కుదిరింది. ఆ తరువాత మూడు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఆ తరువాత నుంచి పోలవరం ఊసే లేదు. బ్యాంకు రుణాలు రాకుండా కూడా అడ్డుకున్నారు. పోలవరాన్ని సిన్సియర్‌గా పూర్తి చేయాలని వైయస్ జగన్ చిత్తశుద్ధితో ఉన్నారు. పూర్తి చేసేది కూడా ఆయనే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. ఇవాళ పొత్తు కుదిరింది కాబట్టి విమర్శిస్తున్నారు. ఇందులో లోపం, పాపం చంద్రబాబుదే. ఆయన వల్ల ఒత్తిడికి గురవుతున్న బీజేపీనే.
తెలుగు భాషను వీరు ఉద్ధరించింది లేదు..మేం తగ్గించింది లేదు. అమిత్ షా, చంద్రబాబు, పవన్‌ల పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు. ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలి. 94 శాతం మంది ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రజలు కోరుకున్న తరువాతే వైయస్ జగన్ ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చారు.
చంద్రబాబు, రామోజీ రావు వంటి వారు ల్యాండ్ టైటిలింగ్అ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియచేశారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించి గతంలో ఈటివిలో పాజిటివ్ స్టోరీ ఇచ్చిందని ఆ వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్సించారు.అయితే ఈ క్లిప్పింగ్ అందరికి కనిపిస్తుందని తెలిసి ప్రెస్ మీట్ జరుగుతున్నసమయంలో ఆవీడియో క్లిప్పింగ్ ను యూట్యూబ్ లింక్ నుంచి తొలగించిందని విమర్శించారు.