పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న సిటీ పోలీసులు
– బేగంపేట–ఎల్బీ స్టేడియం మధ్య ట్రాఫిక్ ఆంక్షలు
– సాయంత్రం 4– రాత్రి 8 గంటల మధ్య అమలు
హైదరాబాద్ :
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మరోసారి నగరానికి రానున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగే ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగర పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు ఐదు వేల మంది సిబ్బందిని మోహరిస్తోంది. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి తీసుకునే బందోబస్తు, భద్రతా చర్యలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) బ్లూ బుక్ ఆధారంగా చర్యలు తీసుకుంటారు. దీని ప్రకారం ప్రధాని పర్యటనకు ఆరు గంటల ముందు నుంచీ బందోబస్తు పాయింట్లలో ఆయా అధికారులు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం నుంచే నగర పోలీసులు బందోబస్తు విధుల్లోకి వచ్చి వారికి కేటాయించిన పాయింట్లలో అప్రమత్తంగా ఉండనున్నారు. ఇప్పటికే కేంద్ర, పోలీసు బలగాల ఆధీనంలో ఉండే రూట్లు, ప్రాంతాలను గురువారం ఎస్పీజీ తనిఖీ చేసింది. ఆయా మార్గాలతో పాటు స్టేడియంలోనూ గురువారం రాత్రి నుంచే ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్, శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. ప్రధాని పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడిక్కడ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈసారి గగనతల నిఘా సైతం ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ వాచ్ కోసం రోడ్ షో జరిగే మార్గం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన స్నైపర్స్‌ను మోహరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు బేగంపేట విమానాశ్రయం–ఎల్బీ స్టేడియం మధ్య ఉన్న మార్గాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ రూట్లలో వాహనాలకు మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో జరుగుతుంది. అలాగే ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభ నేపథ్యంలో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్దేశిత సమయంలో స్టేడియం చుట్టు పక్కల మార్గాల్లోకి సాధారణ వాహనాలను అనుమతించమని, వాహనచోదకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని కోరారు. సభకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాంయిచారు. వీటిపై ఆయా ప్రాంతాల్లో సూచికలు ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626కు కాల్ చేయాలని అధికారులు కోరారు.
హైదరాబాద్ కు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ
మే 11న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరు
28
previous post