సివిల్స్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..
సివిల్ సర్వీస్..భరతమాతకు సేవచేసే అరుదైన అవకాశం: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్ : భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు మాత్రమే లభిస్తుందని, దానిని వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణప్రదీప్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ శిక్షణతో సివిల్స్ ర్యాంకులు సాధించిన 35 మందిని వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా దూరదర్శన్ మాజీ అదనపు డీజీ డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మీ ఈ పయనం మీ జీవితాల్నే కాదు..దేశాన్నే మారుస్తుందన్నారు. సమాజం, ప్రజలు, దేశం అన్నింటిలో పరివర్తన తీసుకొస్తుందన్నారు. సివిల్ సర్వీసు అధికారులు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించారని గుర్తుచేశారు. హామీలు ఇవ్వడం మంచిదే, కానీ వాటిని ప్రజలకు అందించడం అత్యద్భుతం అన్నారు. ఇక్కడ వేర్వేరు మతాలు, సంస్కృతులు, భాషలు, దేవుళ్లు ఉండొచ్చు..అయినా మనమంతా భారతీయులమేనని గుర్తించుకోవాలన్నారు. మీ నిబద్దతే మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు. మీ మీద బోలెడు ఒత్తిళ్లు ఉంటాయని, రాజకీయ బాస్‌లు ఉంటారని, కానీ అసలైన బాస్ ఎవరంటే దేశ ప్రజలేనన్నారు. అసలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్..భారత రాజ్యాంగమేనని గుర్తించుకోవాలన్నారు. మీ మనస్సాక్షికే కట్టుబడి ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రధాని ఎవరైనా ఉండొచ్చు. కానీ సేవలన్నీ అందేది మీ ద్వారా మాత్రమేనన్నారు. జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం..వీటన్నింటినీ ప్రతిఒక్కరూ తప్ప గుర్తించుకోవాలన్నారు. రిఫార్మ్, ఫెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అంటారు..అడ్డంకులన్నింటినీ తొలగించుకుని ముందుకెళ్లాలని గుర్తించవవాలన్నారు. అవకాశాలు అనేవి ఎప్పుడూ చెప్పిరావని, వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకుని వాటి సాయంతో వీలైనంత ఎక్కువ సేవ చేయాలన్నారు. దూరదర్శన్ మాజీ అదనపు డీజీ డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలూ దేనికతే ప్రత్యేకమని, వీటన్నింటిలో వరుసగా విజయాలు సాధించి సివిల్స్ ర్యాంకు పొందడం అంటే చిన్న విషయం కాదని చెప్పారు. ర్యాంకులు సాధించి దేశ సేవకు సంసిద్ధులైన యువతను తాను మస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్, చీఫ్ మెంటార్ డాక్టర్ భవానీ శంకర్లు మాట్లాడుతూ ఈ అకాడమీ ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసిందన్నారు. సివిల్స్ సాధించాలన్న కల ఉంటే చాలదని, దానికి సరైన దిశలో సాధన కూడా అవసరమన్నారు. ఆ సాధన ఎలా ఉండాలన్న విషయంలోనే తాము విద్యార్థులను సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అది అందిపుచ్చుకుని తగిన ప్రణాళికతో సిద్ధమయ్యే వారిలో కొందరికి ర్యాంకులు వస్తాయన్నారు. ఇందులో మార్గదర్శకత్వం, కృషి, అదృష్టం అన్నీ కలగలసి ఉంటాయన్నారు.