Home ప్రత్యేకం మానవజాతి శ్రేయస్సు కోసం వేద, ఆధునిక శాస్త్రాలను అధ్యాయ‌నం చేయాలి

మానవజాతి శ్రేయస్సు కోసం వేద, ఆధునిక శాస్త్రాలను అధ్యాయ‌నం చేయాలి

ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం:టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

0 comment

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో నాలుగు రోజుల సమ్మేళనం ప్రారంభం

విజయవాడ : వేదాలు విజ్ఞాన భాండాగారాల‌ని, ఆధునిక మాన‌వ స‌మాజం శాంతి సౌఖ్యాల‌తో జీవించ‌డానికి వేదాలు, ఆధునిక శాస్త్రాలను మిళితం చేయాల్సిన అవసరం ఉందని, ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పెంపొందాల‌ని టీటీడీ ఈవో  ఏవి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు.

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ విజ్ఞాన వ్యవస్థల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో బుధవారం ప్రారంభమైన నాలుగు రోజుల విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనంలో ఈవో ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సాంకేతిక ప‌రిజ్ఞానం దాగి ఉంద‌న్నారు. ఆధునిక శాస్త్రాలను వేద శాస్త్రాలను కలపడం ద్వారా పరిమితులకు మించి, వినూత్న ఆవిష్కరణల‌ను తీసుకురావడానికి ఈ స‌మ్మేళ‌నం ఒక వేదికగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఆధునిక శాస్త్రాలు అన్ని ప్రశ్నలకు మూలం అయినప్పుడు, అన్ని సమాధానాలకు వేద శాస్త్రాలు మూలమని చెప్పారు. మానవ జాతి శ్రేయస్సుకు ఉపయోగపడే కొత్త పరిష్కారాలను అన్వేషించడానికి రెండింటినీ కలుపుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. శాస్త్రోక్తమైన, ధార్మిక విధానాలు రెండింటినీ మేళవించి పది రోజుల పాటు దాదాపు 7-8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని క‌ల్పించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్థాపనలో వైదిక ధర్మ పరిరక్షణ, ప్రచారంతో పాటు, భవిష్యత్ తరాలకు మానవాళికి ఉపయోగపడే నూతన, సుస్థిర పద్దతుల‌ను స్థాపించడం కోసం వేద మరియు ఆధునిక శాస్త్రాలు రెండింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే టీటీడీ ప్రధాన లక్ష్యమ‌ని ఈవో నొక్కి చెప్పారు.

అంతకుముందు, న్యూ ల్లీలోని జాతీయ‌ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ప్రొ. శ్రీనివాస వరఖేడి ప్రసంగిస్తూ, వేద శాస్త్రాలు స్థిరమైన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయని, అఖండ విద్య వేద విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సూచించారు. ఆధునిక శాస్త్రాలు సమస్యకు కారణాన్ని కనుగొనడంపై దృష్టి సారిస్తే, వేద శాస్త్రాలు ఏ సమస్యకైనా పరిష్కారాన్ని ఇస్తాయ‌న్నారు. ఆధునిక మరియు వేద శాస్త్రాలు కలిస్తేనే, వేద శాస్త్రాల నుండి ఒక కొత్త శాస్త్ర సాంకేతిక‌త‌ ఉద్భవిస్తుంద‌న్నారు. ఇది జరగాలంటే పండితులు, శాస్త్రవేత్తలను ఆహ్వానించాలని, వర్సిటీలో మరిన్ని స‌ద‌స్సులు, పరిశోధన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రఖ్యాత సంస్కృత పండితులు, శ్రీ చంద్రశేఖర సరస్వతీ విశ్వ మహా విద్యాలయ యూనివర్సిటీ విసి బ్రహ్మశ్రీ ప్రొ.కుటుంబ శాస్త్రి మాట్లాడుతూ, యజ్ఞోవైశ్రేష్ఠతమంకర్మ అని యజ్ఞముల ఆధారముగా ఈ విజ్ఞాన కర్మలన్నీ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. అందువ‌ల‌న‌ యజ్ఞములు ఆచరించాల‌ని ఈ విశ్వములో అగ్ని ద్వారానే సమస్త మైనటువంటి కర్మలు నిర్వర్తింప‌బడుతున్నాయని చెప్పారు. దీనికి అనుగుణంగా వేద విశ్వ విద్యాలయంలో అనేక అంశాల‌పై ప‌రిశోద‌న‌లు జరగాలని ఆయ‌న సూచించారు.

తిరుప‌తి ఐఐటి డైరెక్ట‌ర్ ప్రొ.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనంలో వేదంలో దాగి వున్న వైజ్ఞానిక అంశములను ప్ర‌పంచానికి అందిస్తామ‌న్నారు. ఇందుకోసం ఎస్వీ వేద విశ్వవిద్యాలయంతో కలిసి వేద విజ్ఞానాన్ని అందరికీ అందించేలా పనిచేస్తామని తెలిపారు. వేదం అంటే జ్ఞానమని ఆ జ్ఞానం ప్ర‌పంచ‌, భారత అభివృద్ధికి తోడ్పడుతుందని తెలియజేశారు.

న్యూఢిల్లీకి చెందిన ఐకెఎస్ డివిజ‌న్ జాతీయ కో అర్డినేట‌ర్‌ ప్రొ.జిఎస్ఎన్ మూర్తి ప్ర‌సంగిస్తూ..వేద విజ్ఞానాన్ని అన్ని విశ్వవిద్యాలయాలలో ఇంప్లిమెంట్ చేయాల‌న్నారు. తద్వారా వేదంలో ఉన్నటువంటి వేద విజ్ఞానం అందరికీ కూడా అందుతుందన్నారు. సంగచ్ఛధ్వం, సంవదత్వం మంత్రాన్ని చెబుతూ అందరూ కలిసి వేదాల మీద సమగ్రమైనటువంటి పరిశోధనలు జరిపి వేదాలలో ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని అందరికీ అందించాల‌ని పిలుపునిచ్చారు.

సమ్మేళనానికి అధ్యక్షత వహించిన ఎస్వీవివియూ విసి ప్రొ.రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, మన వైదిక ధర్మంలో దాగి ఉన్న విజ్ఞాన బీజాలను అన్వేషించడమే లక్ష్యంగా నాలుగు రోజుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. యూనివ‌ర్సిటీలో జరిగే ఈ ఆత్యాధునిక ఆధునిక విజ్ఞానం – వేద విజ్ఞానం సదస్సులో అమెరికా, ఆస్ట్రేలియా, నేపాల్ వంటి దేశాల నిపుణులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కూడా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. 26 సాంకేతిక సెషన్లలో సుమారు 90 మంది వక్తలు వేదాలలో భూమి మరియు అంతరిక్ష శాస్త్రాలు, అథర్వ వేద వనస్పతి విజ్ఞానం, వేద సృష్టి, సామవేద అగ్ని విజ్ఞానం, ఆయుర్వేదం వంటి ఆసక్తికరమైన అంశాలపై పత్రాలు మరియు ప్రసంగాలను సమర్పించనున్నార‌న్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ స‌ద‌స్సు “నాలెడ్జ్ బ్యాంక్ ” గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వివ‌రించారు.

రిజిస్ట్రార్ రాధాగోవింద త్రిపాఠి, డీన్‌లు ఆచార్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ, ఆచార్య ఫణి యజ్ఞేశ్వరయాజులు, కార్య‌క్ర‌మ కో-ఆర్డినేటర్  తారకరామ శర్మ , ఇతర పండితులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4