తిరుపతి :
వైకాపాకు ఓటేస్తే మీ భూములు మీవి కావు’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం రాత్రి తిరుపతిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని నిలదీశారు. పెంచిన రూ.4వేల పింఛను ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తమదని స్పష్టం చేశారు.తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేశామని గుర్తు చేశారు.
“తిరుపతిలోనే పుట్టి పెరిగాను. వేంకటేశ్వరస్వామి నాకు పునర్జన్మ ఇచ్చారు. ఇక్కడి నుంచే ఎన్టీఆర్, చిరంజీవి పోటీ చేశారు. తిరుపతిలో వైకాపాకు డిపాజిట్ కూడా రాదు. సామాజిక న్యాయానికి కూటమి కట్టుబడి ఉంది. బ్రాహ్మణ కార్పొరేషనను బలోపేతం చేస్తాం. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో సభ్యులుగా బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పాటు కేంద్రంలో మనకు మోదీ గ్యారంటీ ఉంది. మేం వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాం. వైకాపా పాలనలో 160 ఆలయాలపై దాడి జరిగింది.అధికారంలోకి రాగానే దోషులను శిక్షిస్తాం” అని చంద్రబాబు తెలిపారు.