……………………….
అడవి అంటే జీవ వైవిధ్యం! సకల జీవులకు నీడను ఇస్తుంది.
అడవి అంటే ప్రాణవాయువు. మనం వదిలే కార్బన్‌డయాక్సైడ్‌ని పీల్చి, ఆక్సిజన్ వదులుతుంది !
అడవి ఉంటే వాన. భూమికి సారం ఇస్తుంది. మరి మనం అడవికి ఏమి ఇస్తున్నాం? అని నల్లమల అడవిలో రమణారావుని అడిగితే
‘‘ ఏమీ ఇవ్వద్దు. అడవికి హాని చేయకుండా, నేలను కలుషితం చేయ కుండా బతికితే చాలు! ’’అంటాడు, పక్షులకు నీళ్లు పెడుతూ.
‘‘ ప్రకృతిని కాపాడుతున్న అడవికి మనం చాలా బాకీ ఉన్నాం. దానిని తీర్చుకునే చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను..’’ అంటాడు ప్లాస్టిక్ కవర్ల కింద ఇరుక్కొని ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న తంగేడు మొక్కను సరి చేస్తున్న కొమెర జాజి.
ఏదైనా కష్టమొస్తే అడవి వైపు ఆశగా చూడటం, ఆనందం వస్తే, అక్కడి చెట్లకు నీళ్లు పోసి, పక్షులకు కాసిన్ని గింజలు తప్ప మరో పని తెలీని ఇద్దరు ప్రకృతి జీవుల కథ ఇది.
………………….
మనుషుల్లో స్వార్థమే ముఖ్యమైపోయి, ఎవరెలా పోతే తనకేంటి అనుకునే నేటి కాలంలో వీరిద్దరు అడవిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకప్పటి విస్తారమైన అరణ్యాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. వన్యప్రాణులకు ఆహారం కాదుకదా, కనీసం చుక్క నీళ్లు కూడా అందుబాటులో లేదు. ఒకప్పుడు చెరువులు, పొలాల్లో నీరు ఉండటం వల్ల పక్షులకు దాహార్తి తీరేది. ఇప్పుడు అవన్నీ మాయమై అర్బనైజేషన్‌గా మారడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడిరది.దాంతో అరుదైన పక్షులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ఈ పరిస్ధితిని కొంతైనా మార్చి, జీవివైవిద్యం కాపాడాలనే లక్ష్యంతో, పల్నాడు జిల్లా ,అయ్యన్న పాలెం సమీపంలోని పల్నాడు నల్లమల అడవీప్రాంతంలో 73 ఏళ్ల రమణారావు ఓ వినూత్న ఆలోచన చేశారు. గత దశాబ్దకాలంగా నల్లమల అరణ్యంలో వేసంగిలో పక్షులను, జంతువులకు నీళ్లు అందుబాటులో ఉంచి వాటిని రక్షిస్తున్నాడు.
సొంత ఖర్చుతో 50 కి పైగా సిమెంట్ నీటి తొట్టెలు ఏర్పాటు చేశాడు. వాటర్ ట్యాంకర్ తో నీళ్లు రప్పించి రోజూ వాటిని నింపుతున్నాడు. ఈ ఈ అడవి అయ్యన్నపాలెంకు 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. మూగజీవుల దాహం తీర్చడంలో అంతులేని తృప్తి ఉందని అతడు అంటాడు.
‘‘ ఈ ప్రాంతంలో పక్షులన్నీ దాహంతో అరవడం విన్నాక , నా జీవితంలో ఇదే ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాను. ఈ పనిలో అంకాలు, నాగయ్యనాయక్, శ్రీనివాసు అనే యువకులు నాకు సాయపడుతున్నారు.వారు లేక పోతే వృద్ధాప్యంలో ఒక్కడినే ఈ పని చేయలేను.‘‘ అంటాడు రమణారావు.
ఒకపుడు కరవు రావడంతో ఇక్కడ నీళ్లు లేక పక్షులు ఆకుల్లా రాలిపోవడం రమణారావుని కదలించింది.అప్పటి నుండీ ఈ పని చేస్తున్నారు. ఒకపుడు ఒక నెమలి కూడా కనిపించేది కాదు, నీటి తొట్టెలు పెట్టాక నెమలితో పాటు రకరకాల పిట్టలు వస్తున్నాయి. పక్షులను కాపాడితే మా ఊరు బాగుంటుందని మా నమ్మకం .’’ అంటారు అయ్యన్నపాలెం వాసులు.
తనకున్నకొద్దిపాటి పొలం సాగుచేసుకుంటూ, నీళ్ల తొట్టెలు నిర్వహిస్తు పక్షులకు నేస్తంగా మారాడు,రమణారావు. ఇపుడు ఆయన పిలిస్తే నెమళ్లు వస్తుంటాయి. వాటికి గింజలు పెట్టి,నీళ్లు పోస్తూ వేస్తూ తృప్తిగా శేష జీవితాన్నిగడుపుతున్నాడు రమణారావు.
………………………….
అడవి తల్లి సేవలో
మానవాళికి అండగా ఉన్న అడవులను సహజంగా ఎదగనీయకుండా ప్లాస్టిక్ వ్యర్ధాలతో కలుషితం చేస్తున్నారు ఆధునిక మానవులు.
యుఎన్‌ఓ నివేదికల ప్రకారం ప్రజలు చేస్తున్న హాని వల్ల 13 మిలియన్ హెక్టార్ల అడవులు క్షీణిస్తున్నాయి. ప్రాణవాయువు తగ్గిపోతుంది.
ఇలాంటి పరిస్ధితిల్లో రమణారావు లాగే పల్నాడు జిల్లా, కారం పూడికి చెందిన అంకారావు (కొమెర జాజి) అడవిలో పేరుకు పోతున్న చెత్తను ఏరడానికి నడుం బిగించాడు.
తెల్లవారు జామునే నల్లమల అడవిలోకి వెళ్తాడు. గుట్టలు పొదలు దాటుతూ ప్లాస్టిక్ వ్యర్దాలను, సీసాలను ఏరి సొంత ఇంటిని శుభ్రం చేసినట్టు తీర్చిదిద్దుతున్నాడు.
వారానికి నాలుగు సార్లు ఇదే పని జీవితంగా పెట్టుకున్నాడు.
తన పొలంలో పండిన జొన్నలు, సజ్జలను తీసుకెళ్లి అడవిలో పక్షులకు వేస్తుంటాడు.
’’ అరుదైన వృక్షజాతుల్ని రక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే అడవులు పచ్చగా ఉండాలి. వృక్షాలే కాదు, అరుదైన జంతుజాలాన్ని పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. అడవులు తరిగిపోతే అక్కడ ఉండాల్సిన పక్షులు ,జంతువులు ఎక్కడికెళ్ళాలి ? అమ్మలాంటి అడవే మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది.’ అని ఆంటాడు.
నిత్యం ధ్వంసం అవుతున్న అడవిని కాపాడటమే తన ధ్యేయంగా జీవిస్తున్నాడు.
తనకున్న ఎకరంలో జొన్నలు పండించి పక్షులకే వదిలేస్తున్నాడు.
ఈ భూమి మీద పండే ప్రతీ గింజలో నేల మీద జంతువులకు ,పక్షులకు భాగం ఉంది. ప్రకృతిని సంరక్షిస్తే మనిషిని అదే రక్షిస్తుందని నమ్ముతారు రమణారావు,జాజి. వీరిని చూసి సమాజం చాల నేర్చుకోవాలి!
శ్యాంమోహన్. (రూరల్‌మీడియా)