హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏం చేయనుందో సీఎం వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు తదితర అంశాలను హస్తం నేతలు మేనిఫెస్టోలో పొందుపరిచారు.
కాగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, అందుకనుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల మంత్రం పనిచేయడంతో ఈ సారి లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించే హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ‘న్యాయ్ పత్ర’ పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు విడుదల చేసే స్పెషల్ మ్యానిఫెస్టోలో ఎలాంటి హామీలను ప్రకటిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇది వరకే విడదల చేసిన సంగతి తెలిసిందే. ‘పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ’ల పేరుతోమేనిఫెస్టో విడుదల చేయగా.. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అధికారాన్ని కట్టబెట్టటంతో లోక్సభ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ వాటినే కొనసాగించింది. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది.