విజయవాడ: గురువుకు లక్షల విలువ చేసే కారు గిఫ్ట్.. ఈ గురుశిష్యుల బంధానికి వావ్ అనాల్సిందేచాలా మందికి తమ జీవితంలో ఓ మార్గదర్శి ఖచ్చితంగా ఉంటారు. ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని వారు నింపిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంటారు. అలాంటి వ్యక్తుల జాబితాలో ముఖ్యమైన వ్యక్తి.. మనకు చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పిన గురువు. ఆ గొప్ప గురువుకు వీడ్కోలు కార్యక్రమంలో మరిచిపోలేని గిఫ్ట్ అందించారు ఈ విద్యార్థులు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఓ ఉపాధ్యాయుడికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఇది ఇరుగుపొరుగు వారినే కాకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గురు భక్తి అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకోని వారు లేరు. ఆ గురుశిష్యుల మధ్య ఉన్న బంధానికి అందరూ ఫిదా అవుతున్నారు. జేమ్స్ అనే ఉపాధ్యాయుడు. పల్నాడు, అనంతపూర్, నెల్లూరు సహా పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో విధులు నిర్వహించారు. అయితే జేమ్స్ ఈ రోజు (ఏప్రిల్ 30) పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28 న ఉపాధ్యాయుడు జేమ్స్‌కు అభినందనలు, వీడ్కోలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు.పల్నాడు సమీపంలోని చిలకలూరిపేటలో ఈ వేడుక నిర్వహించారు. వేడుక జరుగుతుండగా, ఉపాధ్యాయుడు జేమ్స్.. మాజీ విద్యార్థులు కొందరు మారుతీ సుజుకీ బాలెనో కారును అక్కడికి తీసుకొచ్చారు. ఇది ‘మీకు మా కానుక’ అని పూర్వ విద్యార్థులు చెప్పడంతో ఉపాధ్యాయుడు జేమ్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా అక్కడున్న వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
కాగా జేమ్స్ దగ్గర చదివిన చాలా మంది విద్యార్థులు ఇప్పుడు చాలా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దీంతో గురు భక్తితో అందరూ కలిసి ఈ కారును బహుమతిగా ఇచ్చారు. విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా అన్నీ నేర్పిన గురువులను మరచిపోలేరనడానికి ఈ సంఘటనే ఉదాహరణగా నిలిచిందంటూ అక్కడున్న వారు ప్రశంసిస్తున్నారు.