అనగనగా ఓ కుగ్రామం. కొండ మీద ఉంది. చుట్టూ జీడిమామిడి,పసుపు పంటలు, పనస, అనాస తోటలతో,ఇప్పపూల పరిమళాలతో ఆకుపచ్చగా ఉంటుంది. తిండికి లోటులేని పల్లె కానీ, అక్కడి వారితో చుట్టరికం కలుపుకోవాలంటే ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఎందుకంటే అక్కడ తాగడానికే కాదు, మరుగుదొడ్డిలో పోయడానికి బకెట్ నీళ్లు కూడా దొరకడం కష్టం. నీళ్ల కోసం కొండదిగి రెండు మైళ్ల దూరం పోయి తెచ్చుకోవాలి. ఆ కష్టాలు పడలేకే ఆ ఊరికి కోడలుగా వెళ్లడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడో అద్బుతం జరిగింది. ఆ మార్పుకి కారణం ఐకమత్యం.
కొండ అంచుల మీద ప్రయాణం
ఆ గ్రామం పేరు చాపరాయిగూడ,. అక్కడికి చేరుకోవాలంటే శ్రీకాకుళం జిల్లా, సీతం పేట నుండి 25 కిలో మీటర్ల దూరం ఘాట్ రోడ్ లో ప్రయాణించాలి. దారిలో పొల్ల అనే చిన్న ఊరొస్తుంది. అక్కడి నుండి కొండ అంచుల మీద టూవీలర్ పై 3కిలోమీటర్లు దాటితే ఎత్తయిన కొండ శిఖరం మీద జీలుగు చెట్ల మధ్య ఉంటుందా పల్లె. గ్రామ జనాభా మూడొందలు.
నీళ్ల కష్టాల నుండి బయట పడాలని గ్రామస్తులంతా కలిసి ఒక బోరు వేసి విద్యుత్ మోటారు బిగించారు. నీళ్లు పడ్డాయికానీ, కరెంట్ కోతల వల్ల నీటి సమస్య తీర లేదు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించుకోవాలని సర్కారీ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్క లేదు.
పది మంది ముందడుగు వేశాం
కానీ అదే గ్రామానికి చెందిన పది మంది యువతీ యువకులు మాత్రం అలా చూస్తూ ఊరుకోలేకపోయారు. వారంతా సవర గిరిజనులు,పెద్దగా చదువుకోలేదు. అంతా కలిసి జట్టు కట్టారు. ఊరికి నీరు తెచ్చి పచ్చగా కళకళలాడేలా చేయాలని సంకల్పించారు. పంచాయతీ పెద్దలను కలిశారు.కానీ పరిష్కారానికి దారి కానరాలేదు,ఆ యవతరం మాత్రం పట్టు వదల్లేదు. చివరికి ఒక స్వచ్ఛంద సంస్థ వారికో దారి చూపింది.
గ్రామ సభను పెట్టి, అక్కడి నీళ్ల సమస్యకు సౌరశక్తితో నడిచే బోర్వెల్ మాత్రమే సమాధానమనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎత్తయిన ఐరన్ ర్యాడ్స్ పై ఒక వాటర్ ట్యాంకర్ని ఏర్పాటు చేసి దానిపైన సోలార్ పలకలను అమర్చారు. మెటీరియల్ ఖర్చుని ఎన్జీఓ భరిస్తే ఇంటికొకరు చొప్పున శ్రమదానం చేసి పైపులైను పనులు పూర్తిచేశారు.
కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటను నిజం చేశారు.
ఇపుడు ఇరవైనాలుగు గంటలూ జల ధార ప్రవహిస్తోంది. రోజూ నీళ్ల కోసం బిందెలతో కొండలు ఎక్కి దిగే ఆడవాళ్లు ఇళ్ల ముందే నీళ్లు పట్టుకుంటున్నారు. నీటి వసతి లేక ఆ గ్రామాన్నీ, పంటపొలాల్నీ వదిలి, పట్టణాలకు వలస పోయిన వారు తిరిగి రావడం మొదలయింది.
‘ మరుగు దొడ్డి ఉన్నప్పటికీ నీళ్లు లేక, వాడ కుండా ఆరు బయటకు పోవాల్సి వచ్చేది. ఈబాధలు పడలేక చాలా కాలం ఇక్కడికి కాపురానికి రాలేదు. నీళ్లు వచ్చాయని తెలిసి అత్తారింటికి వచ్చాను’ అని సంతోషంగా సవర భాషలో చెప్పింది కొత్తకోడలు చామంతి.
ఇపుడా ఊరి కుర్రాళ్లకు సంబంధాలు వస్తున్నాయి. చుట్టాల రాకపోకలు మొదలయ్యాయి.
అక్కడితో అయిపోలేదు….
సోలారు మోటారుతో పుష్కలంగా వస్తున్న నీటిని తోడేస్తే ఎలా? ఇదిలాగే కొనసాగితే బంగారు బాతు గుడ్డు కథ నిజం కావడానికి ఎంతోకాలం పట్టదన్న విషయాన్ని గుర్తించారా గిరిజనులు .
భూగర్భ జలాలన్నింటినీ తోడేస్తున్నారు కానీ, వాటిని తిరిగి భూమిలోకి ఇంకే మార్గం గురించి మాత్రం అంతే దీక్షగా ఆలోచించసాగారు. వారి ముందు చూపుకు సీతంపేట మండలం డ్వామా అధికారులు మెచ్చి, నరేగా పథకంలో బోర్లు రీచ్ఛార్జి చేసుకోవడానికి ఆర్దికంగా సహకరించారు. అంతే కాదు, ఇంకుడుగుంతల ఏర్పాటుకు ,పండ్లతోటల సాగుకు తోడ్పాటునందించారు.
భూసారం పెంచారు
వారుంటున్న కొండ చుట్టూ టెర్రసింగ్( వాలులో కందకాలు తవ్వి )వాననీటిని ఒడిసిపడుతున్నారు. భూసారం కొండకిందకు కొట్టుకు పొకుండా ఆపుతున్నారు. ‘‘ మాకు తాగునీరేకాదు ఇపుడు సాగునీటికి లోటులేదు . భూసారం కాపాడుకోవడడం వల్ల కొండవాలులో వరి,సీతాఫలం, జీడిమామిడి,పసుపు పంటలను పండిస్తు అధిక దిగుబడిని సాధిస్తున్నాం’’ అంటున్నారు సోలారు పంపు ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించిన కమల,బడ్డిగ లక్ష్మి,చామంతి,రాజారావు.
వీరు చేపట్టిన జలసంరక్షణ వల్ల జీడిమామిడి పంట దిగుబడి 4 నుండి 8 క్వింటాళ్లుకు పెరిగింది. పసుపు ఎకరానికి రూ.15వేలు ఆదాయం వస్తోంది.
వీరిలో కొందరు పండ్లతోటల సాగు మొదలు పెట్టి సపోటా,మామిడి మొక్కలు పెంచుతున్నారు. వచ్చే ఏడాది కాతకు రావడానికి సిద్ధంగా ఎదుగుతున్నాయి చెట్లు.
ఇప్పనూనె తో వంటలు
ఈ గ్రామస్తులు వంటలకు అవసరమైన వంటనూనెను వారే స్వయంగా తయారు చేసుకుంటారు. కొండల మీద ఇప్ప గింజలను సేకరించి వాటిని గానుగాడి చమురు తీస్తారు. ఆ నూనె కోసం శ్రీకాకులం నుండి వారిని వెతుక్కుంటూ చాలామంది వస్తుంటారని ఆ సవర గిరిజనులు అంటారు.
సంకల్పానికి శ్రమ తోడయితే ఫలితం ఎలా ఉంటుందీ అనేది ఈ గ్రామ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. ఈ ఊరిని చూసి ఆ పద్ధతిలో బతకడానికి చుట్టుపక్కల గిరిజన ఆవవాసాల వారు ప్రయత్నిస్తున్నారు.
……………
శ్యాంమోహన్ (9440 595858)
కొండ మీద ఊరికి నీళ్లు వచ్చాయి!
కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటను నిజం చేశారు
39
previous post