Home ఆంధ్ర ప్రదేశ్ ఓటుతో అరాచక శక్తులపై వేటు వేయాలంటూ పిలుపు

ఓటుతో అరాచక శక్తులపై వేటు వేయాలంటూ పిలుపు

రాష్ట్రాభివృద్ధికి తమ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది

0 comment

రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ

కూటమిని గెలిపించాలని కోరుతూ లేఖ*

విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు,

రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్‌ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవి ఈ ఎన్నికలు. మీ ఉజ్వల భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని ఆకాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

ఒకవైపు విభజన కష్టాలు, మరోవైపు ఆర్థిక లోటుతో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణం మొదలు పెట్టింది. సుపరిపాలనతో అనతికాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసి… సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులెత్తించి, రహదారులు నిర్మించి, పెట్టుబడులు తెచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాం. ప్రజా రాజధాని అమరావతి, పోలవరం పనులను శరవేగంతో చేపట్టాం. ప్రతి వర్గానికి ప్రయోజనం కల్పించేలా 100 కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. 2019లో తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేవాళ్లం.  అలాంటి కీలక సమయంలో మోసపూరిత హామీలు, తప్పుడు ప్రచారాలు, డ్రామాలతో ప్రజలను మోసం చేసి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారం చేపట్టిన తొలి గంట నుంచే విధ్వంస, నిరంకుశ, అరాచక పాలనకు తెరలేపారు. మీ జీవితాలను మార్చడానికి మీరు ఇచ్చిన అధికారాన్ని తన దోపిడీకి సాధనంగా మార్చుకున్నారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ మాఫియాలతో రాష్ట్రాన్ని లూటీ చేశాడు. పన్నులు, ధరల బాదుడుతో ప్రజల రక్తం తాగారు. వ్యవస్థలను చెరబట్టి…. ప్రశ్నించే ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేశారు.

నేడు వైసీపీ భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. అందుకు మనకు వచ్చిన అవకాశమే మే 13వ తేదీన జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రాన్ని కాటు వేసిన వైసీపీ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరు ఓటుతో వేటు వేయాలి. మే 13న మీరు వేసే ఓటు కబ్జాలకు, బాదుడుకు, అరాచకాలకు ముగింపు పలకాలి.

సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఎజెండాతో మీ ముందుకు వచ్చిన కూటమిని ఆశీర్వదించమని కోరుతున్నా. వచ్చే అయిదేళ్లూ రాష్ట్రం కోసం ఏం చేయాలి… రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయంలో కూటమి వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది… విజన్‌ ఉంది… అందుకే అన్ని వర్గాలను కోరుతున్నా….ఆలోచించి ఓటు వేయండి. నిర్భయంగా, నిజాయితీగా ముందుకు వచ్చి మీ మంచి భవిష్యత్‌ కోసం ఓటేయండి. మరో నలుగురితో ఓటు వేయించండి. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి చెందిన లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులను నిండుమనసుతో ఓటేసి గెలిపించండి.

సదా మీ సేవలో…

(నారా చంద్రబాబునాయుడు)

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4