విజయవాడ:
‘‘ చంద్రబాబు మోడీతో చేతులు కలిపాక ప్రతిపక్షం దిశ కోల్పోయిందనే భావన బలపడుతోంది. మోడీ తో జగన్ వీధి పోరాటాలు చేయకపోయినా ఇద్దరి మధ్య బాంధవ్యం లోపాయకారిగా కొనసాగింది. బాబు రెండవసారి మోడీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బిజెపి ఫ్యాక్టరీలో తయారయ్యే మాదక ద్రవ్యం (హిందూ మత తత్త్వం) ఆంధ్రాలో అమ్మకానికి బాబు అధికారిక లైసెన్స్ దారు అయ్యారు. ఇప్పుడు ఆంధ్రాలో రెండు తరాల మధ్య జరుగుతున్న రాజకీయ పోరుగా అర్ధం చేసుకోవాల్సివస్తోంది.
చంద్రబాబు మూసలో తయారయిన పాత తరం ఒక వైపు ఉంటే జగన్ కు చెందిన న్యూ జెనెరేషన్ పాలిటిక్స్ మరో వైపు వుంది. జగన్ శిబిరం లో కొత్తతరం వుంది. వీళ్లల్లో మహిళలు, యువకులు, ఇంతవరకూ ప్రాతినిధ్యానికి నోచుకోని బహుజనులలోని ఫస్ట్ జెనెరేషన్ కు చెందిన వారు ఎక్కువగా వున్నారు. దీనికి భిన్నంగా బాబు శిబిరం లో ఎక్కువమంది ఆరు పదులు దాటినవాళ్లు, కొన్ని ఆధిపత్య కుటుంబాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితులలో జగన్ కు ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రతిపక్షం అందివ్వలేకపోతోందని అనిపిస్తోంది.’’ అంటున్నారు అమెరికాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు గాలి నాగరాజు.
‘‘ కాకపోతే జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయాలకు ఫ్యాక్షన్, నేర మరకలు అంటుకున్నాయి. అవినాష్ రెడ్డి, తోట త్రిమూర్తులు లాంటి వాళ్లకు జగన్ టికెట్ ఇవ్వకుండా ఉండి ఉంటే ఈ కళంకం నుంచి కొంత వరకయినా బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టుగా మెస్సేజి వెళ్ళేది.
నిజానికి రెడ్లంతా జగన్ శిబిరం లో వున్నారా? నెల్లూరు రెడ్ల తిరుగుబాటు చూశాం కదా! అలాగే, కమ్మలు కూడా అందరూ చంద్రబాబు వెనకలేరు. సుజనా లాంటి అతికొద్దిమంది ఎలీట్ తప్ప కమ్మలందరు బాబు పాలనలో లబ్ది పొందింది ఏమీ లేదు.’’ అని నాగరాజు గారు అభిప్రాయపడ్డారు.
‘‘ గడచిన ఐదేళ్లల్లో సొంత ఇమేజ్ పెరిగే పనులు జగన్ ఏమి చేయలేదా? జగన్ హయాం లో పేద బడుగు వర్గాల నుంచీ ఒక కొత్త తరం రాజకీయాలలోకి వచ్చింది కదా! గ్రామా సచివాలయాల ద్వారా పరిపాలన మండల స్థాయి నుంచీ గ్రామ స్థాయికి తీసుకెళ్లారు కదా! నాడు నేడూ కింద పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు అయింది కదా!
వంశధార నది నుంచి 100 కిమీ మేర పైపులైన్లు వేసి ఉద్దానం ప్రాంతానికి రక్షిత మంచినీటి సరఫరాకు ఒక ప్రయత్నం జరుగుతోంది కదా! కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం ఉద్దానం ప్రాంతం లో ఆసుపత్రి కట్టారని విన్నాను. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లితే జగన్ బటన్ ముఖ్యమంత్రి అనే ప్రతిపక్షాల విమర్శను తిప్పికొట్టవచ్చు కదా!
నెగటివ్ కాంపెయిన్ కు విరుగుడు ఎప్పుడూ నెగటివ్ క్యాంపైన్ కాదు.’’ అంటారు నాగరాజు.
( లైవ్ వైర్ ప్రతినిధి )